నిజామాబాద్ జిల్లా వాసులకు తీపికబురు.. త్వరలో జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ సేవలు!

నిజామాబాద్ వాసులకు తీపి కబురు చెప్పారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ సెంటర్ గా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు

Advertisement

త్వరలో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు

డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్ సెంటర్ల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, మౌలిక వసతులు, వైద్యసిబ్బంది, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు.

Advertisement

దశల వారీగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామన్న మంత్రి

త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ఇక్కడ ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజ నరసింహ వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి తగ్గేలా చూడాలన్న ఎమ్మెల్యేలు

నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లలో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement

అంకాపూర్, నందిపేట్ ఆరోగ్య కేంద్రాలపై మంత్రి హామీ

అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

నియామకాలతో వైద్యుల కొరత తీరుస్తున్నాం అన్న మంత్రి

నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇటీవలే జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను నియమించామని తెలిపారు. అదేవిధంగా సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇచ్చామని చెప్పారు.

Advertisement
బస్సుకోసం మంత్రికి చిట్టి చేతులతో లేఖ రాసిచ్చిన బుడతడు.. మంత్రి ఏం చేశారంటే!

ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి

ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు పూర్తి చేస్తామని, జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రభుత్వ హాస్పిటళ్లలో మానవ వనరులు, మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెడిసిన్స్‌, డయాగ్నస్టిక్ సేవలను సమగ్రంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

English Summary

Nizamabad GGH to become a referral hospital with upcoming super specialty services Health Minister Damodar Rajanarsimha announces during a review meeting with district MLAs.