ఉస్మానియా ఆస్పత్రి రికార్డ్.. దేశంలోనే ఒకేసారి ఒకేవ్యక్తికి 5 అవయవాల మార్పిడి!

తెలంగాణ రాష్ట్ర వైద్య రంగం అనేక సంచలనాలను నమోదు చేస్తుంది. ఇటీవల 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లతో నిమ్స్ దక్షిణ భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా సరికొత్త రికార్డును సృష్టించగా తాజాగా ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు ఒకేసారి రోగికి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి రికార్డు సృష్టించారు.

Advertisement

ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాల మార్పిడి

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు మరోసారి కొత్త రికార్డును నమోదు చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాలను (మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్) విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స 36 గంటల పాటు నిరంతరం కొనసాగింది.సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు ఈ అరుదైన ఆపరేషన్ నిర్వహించారు.

Advertisement

ఒకేసారి 5 అవయవాలు.. దేశవ్యాప్తంగా ఇదే తొలి శస్త్ర చికిత్స

కడుపు (Stomach), డ్యూడినమ్ (Duodenum), ప్యాంక్రియాస్ (Pancreas), చిన్నపేగు (Small Bowel), పెద్దపేగు (Right Colon) అవయవాలను ఒకేసారి విజయవంతంగా మార్పిడి చేయడం దేశవ్యాప్తంగా ఇదే తొలి శస్త్ర చికిత్స. ఈ విజయం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి చేర్చింది. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ఉస్మానియా హాస్పిటల్ సీనియర్ డాక్టర్ల బృందం నిర్వహించింది.

చారిత్రాత్మక విజయంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

అనస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్ బృందాలు సహా మొత్తం వైద్యసిబ్బంది ఈ శస్త్ర చికిత్స కోసం అంకితభావంతో పని చేశారు. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కొనసాగుతోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ చారిత్రాత్మక విజయంపై హర్షం వ్యక్తంచేశారు.దేశంలోనే తొలిసారిగా ఇంత క్లిష్టమైన మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ వైద్యరంగానికి గర్వకారణమని మంత్రి అభినందించారు.

Advertisement

ప్రపంచ స్థాయి వైద్య సేవలు తెలంగాణాలో అందుతున్నాయన్న మంత్రి

ప్రాణాలను కాపాడటానికి అంకితభావంతో పని చేసిన వైద్యులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యాధునిక, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి ఉస్మానియా హాస్పిటల్ ఘనత ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌లో పాల్గొన్న అన్ని డిపార్ట్‌మెంట్ల వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

English Summary

Osmania Hospital doctors create history with India's first successful multi-visceral transplant of 5 organs (Stomach, Duodenum, Pancreas, Small Bowel, Right Colon) in a single 36-hour surgery on a 30-year-old engineer from Sircilla. Telangana Health Minister Damodar Rajanarsimha praises the team.