రంగారెడ్డి జిల్లాకు మహర్దశ.. రేడియల్ రోడ్ 2 నిర్మాణ పనులు స్పీడప్!

తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలోనూ, నగరం చుట్టుపక్కల ప్రాంతాలలోనూ అభివృద్ధికి తెలంగాణా సర్కార్ ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. రేడియల్ రోడ్- 2 నిర్మాణం కోసం శంషాబాద్ - షాద్ నగర్ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది.

Advertisement

రేడియల్ రోడ్- 2 నిర్మాణం కోసం భూసేకరణ

ఈ రోడ్ నిర్మాణం కోసం రెవిన్యూ అధికారులు రైతులతో భూసేకరణకు సంబంధించిన సానుకూలమైన చర్చలు జరిపారు. ఈ క్రమంలో పది రోజుల్లో భూసేకరణను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా షాద్నగర్ డివిజన్లోని చుక్కమెట్, ముట్ పూర్, లాలాపేట్, తుమ్మపల్లి, ఉమ్మేత్యాల్ వంటి గ్రామాలలో ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే పనులు జరుగుతున్నాయి.

Advertisement

రైతులను ఒప్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్

ఇక్కడ భూములు ఇవ్వడానికి రైతులకు ఉన్న అభ్యంతరాలను తెలుసుకుని రైతులతో మాట్లాడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక శాసనసభ్యులు వీర పల్లి శంకర్ రైతులను ఒప్పించారు. దీంతో ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే పనులలో వేగం పెరిగింది. ఆర్ఆర్ యాక్ట్ 2013 ప్రకారం మార్కెట్ విలువకు అనుగుణంగా , పారదర్శకంగా పరిహారం చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 81 కిలోమీటర్ల రేడియల్ రోడ్ -2

దీంతో రైతులు స్వచ్ఛందంగా అంగీకార పత్రాలు అందించడంతో భూసేకరణ పనులలో వేగం పుంజుకుంది. బుద్వేల్ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి షాబాద్, కొండూరు, పరిగి మండలాల మీద కొడంగల్ వరకు 81 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించే ఈ రోడ్డు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచి కొడంగల్ వరకు మంచి కనెక్టివిటీని అందిస్తుంది.

Advertisement

రేడియల్ రోడ్డు 2 నిర్మాణం పూర్తయితే వేగంగా పారిశ్రామికీకరణ

ఈ రహదారి పూర్తి కావడం ద్వారా శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతాలలో పారిశ్రామిక కారిడార్లు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రహదారి నిర్మాణంతో ఐటి మరియు ఇతర పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ నుంచి భారీయంత్రాలు, ముడిపదార్థాలు ఈ మార్గంలో సులభంగా తరలించడానికి వీలవుతుంది. ఈ రేడియల్ రోడ్డు 2 నిర్మాణం పూర్తయితే సమీప గ్రామాలు మండలాలలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంటుంది.

హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ప్రత్యామ్నాయ మార్గం

స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయి. మారుమూల గ్రామాలకు సైతం రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పారిశ్రామిక జోన్ ఏర్పడి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి కూడా ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను మెగా గ్రోత్ కారిడార్లు గా మార్చడంలో కీలక భూమిక పోషిస్తుంది.

English Summary

radial road 2 hyderabad: Revenue officials have started land acquisition for Radial Road-2 from Budvel to Kodangal in Shamshabad-Shadnagar division. The 81 km road will boost industrial growth and create employment opportunities.