16 జిల్లాల్లో లోటు వర్షాలతో సాగు సంక్షోభం..అన్నదాతకు గండం!

తెలంగాణా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. అనేక జిల్లాలు పూర్తిగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలోని 16 జిల్లాలలో లోటు వర్షపాతం నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

వర్షాలు లేక 4.22 లక్షల ఎకరాలలో మాత్రమే వరినాట్లు

వ్యవసాయ శాఖ తాజాగా సమర్పించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 65.95 లక్షల ఎకరాల్లో వరిసాగు చెయ్యాలని లక్ష్యం నిర్ణయించారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4.22 లక్షల ఎకరాలలో మాత్రమే ఇప్పటివరకు అన్నదాతలు నాట్లు వేశారు. రుతుపవనాలు తెలంగాణా రాష్ట్రంలోకి జూన్ మాసంలో ప్రవేశించినా జూన్ నుండి ఇప్పటివరకు సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

Advertisement

16 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు

ముఖ్యంగా జులై నెలలో 16 శాతం లోటు వర్షాలు ఇప్పటివరకు రికార్డ్ అయ్యాయి. ఇది అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, జగిత్యాల, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఈ నెలలో విస్తారంగా వర్షాలు పడితేనే సాగు

ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేయటంతో చాలా మంది రైతులు సాగు చెయ్యాలంటే భయపడుతున్నారు. ఇప్పటివరకు నాట్లు వేయని రైతులు ఈ నెలలో అయినా విస్తారంగా వర్షాలు పడితేనే నాట్లు వేసే అవకాశం ఉంది. లేదంటే వరినాట్లు వేయటానికి రైతులు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చెయ్యాలని సూచిస్తోంది.

Advertisement

ప్రత్యామ్నాయ పంటలు సాగు చెయ్యాలని రైతులకు సూచన

వర్షాలు లేని కారణంగా ఎక్కువ నీరు అవసరం లేని ప్రత్యామ్నాయ పంటల సాగు చెయ్యాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు మాత్రం ఇంకా వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడకుంటే అటు అన్నదాతలే కాదు, ఇటు అందరూ తాగునీటి కోసం కూడా కష్టపడవలసి వస్తుంది.

English Summary

telangana rain deficit : Telangana has not received the expected level of rainfall. It is particularly concerning that a rainfall deficit has been recorded in 16 districts of the state.