Anil Menon: భారతీయ నాసా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన రష్యా..!


భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon) ఇవాళ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్-29 (Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరారు. అనిల్ మీనన్‌కు ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం విశేషం. ఎక్స్‌పెడిషన్ 74, 75 మిషన్లలో భాగంగా సుమారు 8 నెలల పాటు ఆయన అక్కడే ఉండి ప్రయోగాలు చేస్తారు.

Advertisement
US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ - కాంగ్రెస్ కు ట్రంప్ నోటీసు..!
Advertisement

రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాలతో కలిసి ఇవాళ అనిల్ మీనన్ అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగం జరిగిన మూడు గంటల్లోనే వీరి నౌక స్పేస్ స్టేషన్‌తో సురక్షితంగా అనుసంధానం కానుంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. అంతరిక్షంలో ఇరు దేశాలు తమ బంధాన్ని కొనసాగిస్తూ ఈ ప్రయోగాన్ని చేపట్టడం విశేషం.

పసిఫిక్ మహాసముద్రం మీదుగా శరవేగంగా 'సూపర్ ఎల్‌ నినో: ట్రాక్ చేసిన నాసా

49 ఏళ్ల అనిల్ మీనన్ అమెరికాలోని మిన్నియాపాలిస్‌లో జన్మించారు. ఆయన తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. నాసా వ్యోమగామిగా 2021లో ఎంపిక కావడానికి ముందు ఆయన వైద్యం, సైనిక సేవల్లో అనుభవం సాధించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్‌లో కల్నల్‌గా పనిచేసిన అనిల్, గతంలో అఫ్గానిస్థాన్‌లోనూ సైనిక సేవలందించారు. ప్రముఖ అంతరిక్ష ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX)లో మొట్టమొదటి ఫ్లైట్ సర్జన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఈసారి 8 నెలల సుదీర్ఘ బసలో అనిల్ మీనన్ మానవ అంతరిక్ష ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు. గురుత్వాకర్షణ లేని శూన్య ప్రదేశంలో సెమీకండక్టర్ స్ఫటికాల తయారీ, వ్యోమగాములలో రక్తప్రసరణ తీరును పరిశీలించడం వంటి పనులను ఆయన పర్యవేక్షిస్తారు. అలాగే ఏఐ, అగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఆధారిత అల్ట్రాసౌండ్ వైద్య పరికరాల పనితీరును, ఇతర వినూత్న బయోప్రింటింగ్ నమూనాలను పరీక్షిస్తారు.