హార్ధిక్ పాండ్యా కోసం రేసులో 7 ఐపీఎల్ ఫ్రాంచైజీలు..! లైట్ తీసుకున్న ఆ రెండూ..!

ముంబై ఇండియన్స్ సారథి, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ముందు ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2015లో ముంబైతో ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 2021 వరకు అదే జట్టులో కొనసాగారు. ఆ తర్వాత కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరించి, మళ్లీ ముంబైకి కెప్టెన్‌గా తిరిగొచ్చారు. హార్దిక్ నాయకత్వంలోని మూడు ఐపీఎల్ సీజన్లలో ముంబై జట్టు వరుసగా 10, 3, 9 స్థానాల్లో ముగించింది.

Advertisement

హార్దిక్ కోసం 7 ఫ్రాంచైజీల పోటీ (Hardik Pandya)

తాజా సమాచార ప్రకారం, హార్దిక్‌ను దక్కించుకోవడానికి మొత్తం ఏడు ఫ్రాంచైజీలు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. ఈ బదిలీ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ ముందుండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ గట్టి పోటీ ఇస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కూడా హార్దిక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ఈ స్టార్ ఆల్రౌండర్ రేసులో లేవని తెలుస్తోంది. ఈ ఆల్రౌండర్‌ను దక్కించుకునేందుకు భారీ వ్యయంతో కూడిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Advertisement

బెంగళూరుకు మారిన హార్దిక్ శిక్షణ కేంద్రం

మరోవైపు, హార్దిక్ పాండ్య తన నివాసాన్ని శాశ్వతంగా బెంగళూరుకు మార్చారు. నగర శివార్లలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ని తన శాశ్వత శిక్షణా కేంద్రంగా ఎంచుకున్నారు. సాధారణంగా టీమిండియా ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి లేదా ఫిట్‌నెస్ పరీక్షల కోసమే సీఓఈని సందర్శిస్తుంటారు. కానీ, తన కెరీర్ ముగిసే వరకు అక్కడే నిరంతరం ప్రాక్టీస్ చేయాలని హార్దిక్ నిర్ణయించుకోవడం విశేషం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి భారత క్రికెటర్ ఆయనే.

Advertisement

హార్ధిక్ గాయాల చిట్టా

గత పదేళ్లుగా ముంబైలో నివసిస్తున్న హార్దిక్, సాధారణంగా ఘన్సోలిలోని ముంబై ఇండియన్స్ అకాడమీలోనే శిక్షణ పొందేవాడు. అయితే, ముంబైలోని లోయర్ పరేల్ నివాసం నుండి ప్రతిరోజూ ప్రయాణించడం ఇబ్బందిగా మారడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తొడ కండరాల గాయం (క్వాడ్రిసెప్స్) నుంచి కోలుకుంటున్న 32 ఏళ్ల హార్దిక్, గత ఆరు నెలలుగా బెంగళూరులోని సీఓఈలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గాయం కారణంగానే ఆయన యూకే పర్యటనకు కూడా దూరమయ్యారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాడిగా హార్దిక్‌కు సీఓఈలో గాయాల నిర్వహణ నుంచి నైపుణ్యాల శిక్షణ వరకు అన్ని రకాల ప్రపంచ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఐపీఎల్ లేదా జాతీయ జట్టు బాధ్యతలు లేని సమయంలో ఆయన బెంగళూరులోనే గడపనున్నారు. అటు ఐపీఎల్ బదిలీలు, ఇటు నివాసం మార్పుతో హార్దిక్ పాండ్య కెరీర్‌లో ఒక సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ కొత్త మార్పులు ఆయన భవిష్యత్తు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

English Summary

Hardik Pandya is reportedly set to leave the Mumbai Indians ahead of the next IPL season, with seven franchises interested in the all-rounder. Amid the transfer rumors, Pandya has permanently shifted his base to Bengaluru to train at the BCCI Centre of Excellence, marking a major career transition for the star cricketer.