ఐపీఎల్ స్టార్ పై ఎఫ్ఐఆర్: అతని తండ్రినీ వదల్లేదు..!!
ఐపీఎల్ స్టార్ క్రికెటర్ అతని తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిపై మధ్యప్రదేశ్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇంట్లో పనిచేసే వంట మనిషిపై శారీరక దాడికి పాల్పడటంతో పాటు, తీవ్రంగా దుర్భాషలాడి, అక్రమంగా బంధించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రీడా, పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ ఐపీఎల్ స్టార్ క్రికెటర్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.
పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న శశాంక్ సింగ్, అతని తండ్రి శైలేష్ సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ వారి ఇంట్లో వంట మనిషిగా పని చేస్తోన్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాటీబాద్ పోలీసులు ఈ కేసు పెట్టారు. భోపాల్ సమీపంలోని మెండోరిలో ఉన్న శశాంక్ సింగ్ నివాసంలో విపేంద్ర కొంతకాలంగా కుక్‌గా పనిచేస్తున్నారు. నెలకు రూ.15,000 జీతంతో పాటు, ఉచిత వసతి కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అతడిని పనిలో పెట్టుకున్నారు.

వంటమనిషిగా చేరిన కొద్ది గంటల్లోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు బాధితుడు పేర్కొన్నారు. తాను వండిన ఆహార నాణ్యత సరిగా లేదంటూ యజమానులు వేధించారని ఆరోపించారు. వారి వేధింపులు భరించలేక తాను ఉద్యోగం మానేసి స్వగ్రామానికి వెళ్లిపోతానని చెప్పడంతో శశాంక్ సింగ్, అతని తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని బాధితుడు తన ఫిర్యాదులో పొందుపరిచారు.
తాను బయటివారినెవరినీ సంప్రదించకుండా ఉండేందుకు శశాంక్ సింగ్, అతని తండ్రి బలవంతంగా తన మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని విపేంద్ర ఆరోపించారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పని చేయించుకోవాలని చూశారని అన్నారు. వారి దాడి నుంచి తప్పించుకోవడానికి తాను ఒక గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నప్పటికీ, తండ్రీకొడుకులతో పాటు వారి డ్రైవర్ కూడా తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించి తనను దారుణంగా కొట్టారని బాధితుడు వాపోయారు.
ఈ దాడి ఘటన అనంతరం పోలీసులు బాధితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో బాధితుడి శరీరం, ముఖంపై స్పష్టమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో ధృవీకరించారు. దీంతో బాధితుడి ఫిర్యాదును, మెడికల్ రిపోర్టులను ప్రాతిపదికగా తీసుకుని రాతిబాద్ పోలీసులు తదుపరి చర్యలు వేగవంతం చేశారు. ఈ కేసులో కుటుంబ డ్రైవర్‌ను కూడా పోలీసులు సహ నిందితుడిగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని వేర్వేరు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బహిరంగంగా అసభ్య పదజాలంతో దూషించడం (సెక్షన్ 296-బి), ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా దాడి చేయడం (సెక్షన్ 115-2), ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో గ్రూపుగా దాడి చేయడం (సెక్షన్ 3-5) కింద కేసులను నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications