ఉరికి బదులు ఇంజెక్షన్ తో మరణశిక్ష- తేల్చేసిన సుప్రీంకోర్టు..!
ఇంత అభివృద్ది చెందిన కాలంలోనూ ఉరి ద్వారా మరణశిక్ష విధించడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఉరికి బదులు దోషులకు తక్కువ బాధ కలిగించే మరణాల్ని ప్రసాదించలేమా అన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా ఉరిశిక్ష బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ తమ నిర్ణయం చెప్పేసింది.
ఉరిశిక్ష స్థానంలో విషపు ఇంజెక్షన్ వంటి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఉరిశిక్ష యొక్క రాజ్యాంగ బద్ధతను మరోసారి సమర్థించింది. దేశంలో ప్రస్తుతానికి మరణశిక్ష అమలు చేసే పద్ధతిగా ఉరితీయడమే కొనసాగుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. ఈ మేరకు దోషికి తక్కువ నొప్పి కలిగించి, వారి గౌరవాన్ని కాపాడే విధంగా మరణశిక్షను అమలు చేసేందుకు, ఉరికి బదులుగా ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

అదే సమయంలో ఈ అంశంపై గతంలో ఇచ్చిన మూడు తీర్పులను విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలా చేయడానికి తగిన ఆధారం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రిషి మల్హోత్రా.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా విషపు ఇంజెక్షన్, కాల్చివేత, కరెంటు షాక్ లేదా గ్యాస్ ఛాంబర్ వంటి పద్ధతులను సూచించారు. వీటి ద్వారా దోషి 5 నిమిషాల్లోనే చనిపోతాడని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై తమ తీర్పు అంతిమం కాదని, మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై బలమైన శాస్త్రీయ ఆధారాలు లభిస్తే భవిష్యత్తులో ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై సమగ్ర సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని కూడా కోర్టు సూచించింది. ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణను ముగించి తీర్పును జనవరి 22కి రిజర్వ్ చేసింది.














Click it and Unblock the Notifications