అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్ లకు లక్ష రూపాయలు.. పండుగ చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు శుభవార్త చెప్పింది. తెలంగాణాలో వారి కోసం మరో ముఖ్యమైన సంక్షేమ చర్యను అమలు చేసింది. వారి సర్వీస్ ఎండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందుతుండగా, కొత్త నిర్ణయం ప్రకారం టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున చెల్లించనున్నారు.
ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క దీని కోసం ఎంతో కృషి చేశారు. దీనికోసం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌తో చర్చలు జరిపి ఫైనాన్స్ మంత్రి భట్టి విక్రమార్క ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,580కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 వేల మంది టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు.

అంగన్వాడీ సిబ్బందికి పెద్ద ఉపశమనం
ప్రతి సంవత్సరం సుమారు 7 వేల మంది రిటైర్ అవుతున్నారు. రిటైర్మెంట్ వయస్సు 65 సంవత్సరాలు. అంతేకాకుండా, 60సంవత్సరాలు నిండిన తర్వాత స్వచ్ఛందంగా సర్వీసు నుంచి వైదొలగాలనుకునే వారికి కూడా ఇదే రిటైర్మెంట్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇది అంగన్వాడీ సిబ్బందికి పెద్ద ఉపశమనం. పదవీ విరమణ తర్వాత కూడా కొంత ఆర్థిక భద్రత లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోజనాలు పొందినవారు ఆసరా పెన్షన్‌కు కూడా అర్హులే.
అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ప్రభుత్వం
ఇటీవలి అధికారిక సమాచారం ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది అంగన్వాడీ సిబ్బందికి మొత్తం రూ.15.61 కోట్లు సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌గా చెల్లించారు. ఇందులో 473మంది టీచర్లకు రూ.4.73కోట్లు, 1,930మంది హెల్పర్లకు రూ.9.65కోట్లు అందాయి. దీంతో ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు అయ్యింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నారుల పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణీలు, బాలింతల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్న సీతక్క
వారి సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ రకమైన ఆర్థిక మద్దతు అందిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఊరట కలిగించింది. ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున, రాబోయే రోజుల్లో మరింత మందికి ఈ ప్రయోజనాలు అందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమం దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుందని మంత్రి సీతక్క సూచించారు.












Click it and Unblock the Notifications