బిల్లులు నెగ్గేసినట్లే..! అక్కడ జాగ్రత్త- కూటమి ఎంపీలతో చంద్రబాబు..!
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ దిశానిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ మేరకు వారికి కీలక సూచనలు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వే్షన్ బిల్లులకు సంబంధించి ఎంపీలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన లోక్ సభ, రాజ్య సభ ఎంపీలంతా సాయంత్రానికి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే బిల్లుల రాక సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ ఎంపీలకు చంద్రబాబు వివరించారు.
బీజేపీ, జనసేన, టీడీపీకి చెందిన ఎంపీలు అంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఏపీ నుంచి ఎంపీలు హాజరు కాలేదన్న సమస్య రాకూడదన్నారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయలేదని గుర్తుచేశారు. తాజా డీలిమిటేషన్ తోనూ అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరుగుతాయని వెల్లడించారు. ఈసారి ఏపీకి చెందిన ఎంపీలు ఎన్డీఏ చేసే సూచనల్ని తూచా తప్పక పాటించాలని వారిని కోరారు.

అలాగే మహిళా బిల్లు నెగ్గుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో గెలిచిన మహిళా ప్రతినిధుల్ని కూడా ఢిల్లీకి పంపుదామని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా బిల్లు వచ్చే సమయంలో పార్లమెంటులో మహిళా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఇవాళ రాత్రి ఎన్డీఏ ఎంపీలకు విందు సమావేశం ఉందన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలకు పూర్తి స్థాయి మద్దతు లభించేలా చూడాలని ఈ సందర్భంగా సీఎం ఎంపీల్ని కోరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల లాంటి చారిత్రక నిర్ణయంలో ఎంపీలుగా ఉండటం అదృష్టమన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు కూడా చంద్రబాబుతో పలు కీలక అంశాల్ని పంచుకున్నారు.












Click it and Unblock the Notifications
