ఖర్గే ఫైనల్ ట్రయల్స్: స్టాలిన్, శరద్ పవార్ ఇంటికి
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఒకట్రెండు ప్రతిపక్ష, తటస్థ పార్టీలు కూడా బిల్లు వైపే మొగ్గు చూపుతోన్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్), డీఎంకే.. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయబోతోంది.
డీలిమిటేషన్ బిల్లు సోమవారం లోక్ సభ సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమి ఇండియా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. బుజ్జగింపులకు తెర తీసింది. విస్తృత స్థాయిలో రాజకీయ సమీకరణలను వేగవంతం చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రాంతీయ, మిత్ర పార్టీల అధినేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోన్నారు. డీలిమిటేషన్ వైపు మొగ్గు చూపిన వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోన్నారు.

ఇందులో భాగంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో స్వయంగా భేటీ కానున్నారు మల్లికార్జున్ ఖర్గే. స్టాలిన్ నివాసంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. ఆయన వెంట కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు గానీ అది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇన్నాళ్లూ డీలిమిటేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వచ్చిన స్టాలిన్.. ఇప్పుడు హఠాత్తుగా మనసు మార్చుకోవడానికి గల కారణాలపై ఖర్గే ఆరా తీయనున్నారు.
అలాగే.. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి గల కారణాలను కూడా వివరిస్తారని అంటున్నారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా కలిగే నష్టాలను కూడా వివరిస్తారని తెలుస్తోంది. మల్లికార్జున్ ఖర్గే చేపట్టనున్న ఈ బుజ్జగింపు ప్రయత్నాలకు స్టాలిన్ ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారనేది వెల్లడి కావాల్సి ఉంది.
ఖర్గే ప్రయత్నాలు స్టాలిన్ తోనే ఆగిపోవట్లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- ఎస్పీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ను కూడా ఆయన కలువనున్నారు. చెన్నై నుంచి నేరుగా ముంబైకి బయలుదేరి వెళ్తారు. అనారోగ్యంతో ఉన్న పవార్ ను పరామర్శిస్తారు. డీలిమిటేషన్ పై నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరనున్నారు. ఈ సమావేశంలో ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియ సులే కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
