రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంలో కొత్త మార్గదర్శకాలు.. ఆధార్ లింకేజీ తహప్పనిసరి!
తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనిస్తున్న 'మహాలక్ష్మి' రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. సబ్సిడీ ప్రయోజనాలు పక్కాగా అర్హులైన కుటుంబాలకే అందేలా, పారదర్శకతను పెంచే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ జీవో నంబర్ 19 ద్వారా కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇప్పటికే పథకం కింద లబ్ధి పొందుతున్న వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సమర్పించి, వాటిని రేషన్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ లేదా సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క అర్హుడూ సబ్సిడీకి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పద్ధతులను అందుబాటులో ఉంచింది.

వృద్ధులు లేదా వేలిముద్రలు సరిగా పడని లబ్ధిదారులు కళ్ల కనుపాపల స్కాన్ లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసుకోవచ్చు. బయోమెట్రిక్ పద్ధతులు సాధ్యం కాని సందర్భాల్లో ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేదా టైమ్-బేస్డ్ ఓటీపీని ఉపయోగించుకోవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలను పరిశీలిస్తారు. ఆధార్ నంబర్ ఇంకా లేనివారు నమోదు రసీదుతో పాటు ఓటర్ ఐడీ, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలతో ప్రయోజనం పొందే వెసులుబాటు కల్పించారు.
రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు నెలవారీ వంట ఖర్చు భారాన్ని తగ్గిస్తున్న ఈ పథకం కింద, వినియోగదారులు మొదట గ్యాస్ ఏజెన్సీకి పూర్తి సిలిండర్ ధర చెల్లిస్తే, సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన అర్హులైన కుటుంబాలకు కూడా ఈ పథకం ప్రయోజనాలు విస్తరించే దిశగా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
సబ్సిడీ నిరంతరాయంగా ఖాతాలో జమ కావాలంటే లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ మరియు బ్యాంకు ఖాతా వివరాలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. వివరాలలో తేడాలు ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అప్‌డేట్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
