ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026.. 11 నూతన పాలసీలు ఆవిష్కరణ!
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలపడేందుకు ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026' నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు వేదికగా 11 నూతన పాలసీలను ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పరిశ్రమలు, ఐటీ, విద్యా శాఖలు ఈ విధానాలను సిద్ధం చేస్తున్నాయి.గతేడాది జరిగిన సమిట్‌తో పోలిస్తే ఈసారి స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. దాదాపు 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు ఎక్స్‌పో హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యికి పైగా కంపెనీలు, 1300కు పైగా ప్రతినిధులు, వీరిలో 220 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నారు. రక్షణ ఎక్స్‌పో, ఎయిర్ షో, ఇండియాజాయ్, స్టార్టప్ అరీనా, క్లైమేట్ కాన్‌క్లేవ్, ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్, తెలంగాణ పెవిలియన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా భాగంగా ఉంటాయి.

కొన్ని ఎక్స్‌పోలను సాధారణ ప్రజలకు కూడా తెరిచి ఉంచనున్నారు.తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ పాలసీలు రూపొందుతున్నాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోంది. ఈ సమిట్ ద్వారా తయారీ రంగం విస్తరణ, ఉపాధి అవకాశాలు పెంపు, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం ప్రధాన లక్ష్యం.
ప్రకటించనున్న 11 పాలసీల విషయానికి వస్తే
ఇండస్ట్రియల్ పాలసీ 2.0
ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ
టెక్స్‌టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0
ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ
లాజిస్టిక్స్ పాలసీ
ఐసీటీ పాలసీ 2.0
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ
డేటా సెంటర్స్ పాలసీ 2.0
ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) పాలసీ
ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ
ఇండస్ట్రియల్ పాలసీ 2.0 ద్వారా తయారీ రంగాన్ని మరింత విస్తరించి, రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా నిలపాలని భావిస్తున్నారు. టెక్స్‌టైల్స్, అపారెల్, ఫుట్‌వేర్, లెదర్ వంటి కార్మికులకు ఎక్కువ ఉపాధి కల్పించే రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగంలో ఇప్పటికే ఉన్న ఆధారాన్ని బలోపేతం చేసి కొత్త పెట్టుబడులు తీసుకురావాలన్నది లక్ష్యం.
లాజిస్టిక్స్ పాలసీ ద్వారా రవాణా, వేర్‌హౌసింగ్, సరఫరా గొలుసు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు.ఐటీ రంగంలో ఐసీటీ పాలసీ 2.0, జీసీసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు ప్రత్యేక విధానాలు రాష్ట్రాన్ని డిజిటల్ హబ్‌గా మరింత బలపరుస్తాయి. ఏవీజీసీ పాలసీ అనిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో అవకాశాలను విస్తరిస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే పాలసీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను ఇక్కడే అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు సమిట్ ఏర్పాట్లను పలుమార్లు సమీక్షించారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రం యొక్క సంస్కృతి, చరిత్ర, అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా కూడా నిలవనుంది. క్లైమేట్ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర వాతావరణ మార్పు చర్యా ప్రణాళికను కూడా విడుదల చేయనున్నారు.మొత్తంగా చూస్తే ఈ గ్లోబల్ సమిట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే అవకాశంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
