హుటాహుటిన విదేశాల నుంచి 165 టన్నుల బంగారాన్ని వెనక్కి తెచ్చిన ఇండియా
ఏకంగా 165 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకురావడం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న ఒడుదొడుకుల మధ్య విదేశాల్లో భద్రపరిచిన మన బంగారాన్ని సురక్షితంగా స్వదేశానికి రప్పించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 మధ్య ఈ బంగారాన్ని హుటాహుటిన తీసుకువచ్చారు.
ఈ తరలింపుతో దేశంలోని ఆర్బీఐ వాల్ట్స్ లో బంగారం నిల్వల వాటా గణనీయంగా పెరిగింది. గతంలో 65.4 శాతంగా ఉన్న దేశీయ నిల్వల వాటా ఇప్పుడు 84 శాతానికి చేరుకుంది. స్వదేశం, విదేశాల్లో కలిపి భారత్ వద్ద మొత్తం బంగారం నిల్వలు సుమారు 880.52 టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద 140.39 టన్నుల బంగారం ఉంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో
1990ల్లో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. 1991 నవంబర్‌లోనే ఆ అప్పును తీర్చేసినా, అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు, విదేశీ కరెన్సీ మార్పిడి సౌలభ్యం కోసం కొంత భాగాన్ని అక్కడే ఉంచారు. లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రపంచ స్థాయిలో బంగారు నిల్వల నిర్వహణకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది.
881 టన్నులతో 8వ స్థానం
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యా ఆస్తులు, బంగారం నిల్వలపై ఆంక్షలు విధించిన ఘటన అనేక దేశాలను ఆలోచనలో పడేసింది. విదేశాల్లో ఉంచిన జాతీయ ఆస్తులపై ఎప్పుడైనా అనిశ్చితి లేదా ఆంక్షల ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాతో, నిల్వలను సొంత గడ్డపైనే బలోపేతం చేసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా లెక్కల ప్రకారం, అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్ 881 టన్నులతో ఎనిమిదో స్థానంలో ఉంది. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చైనా, రష్యా, స్విట్జర్లాండ్ దేశాలు మన కంటే ముందున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా భారతదేశ ఆర్థిక పునాదులు బలంగా ఉండేలా ఆర్బీఐ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజలకు కీలక భరోసాగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications
