కార్తిక దీపం అంటుకుని యువతి మృతి.. హైదరాబాద్ లో పెను విషాదం!
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో వెలిగించిన కార్తిక దీపమే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో నివాసముండే 18 ఏళ్ల సాయి వెంకట సింధు స్థానికంగా రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటిక్ నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతోంది. ఈ నెల 12వ తేదీ రాత్రి తన బొటిక్ మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.
ఇంటి ప్రధాన గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తిక దీపం ప్రమాదవశాత్తూ ఆమె ధరించిన చీర కొంగుకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ చికిత్స పొందుతున్న సింధు పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. చిన్న వయసులోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సింధు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కార్తిక మాసం, దీపావళి వంటి పండుగల సమయాల్లో ఇళ్ల వాకిళ్లలో, గేట్ల వద్ద, మెట్ల పక్కన దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఏమాత్రం అప్రమత్తత లేకపోయినా ఇవి పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గతంలోనూ హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుర్ఘటనలు అనేకం జరిగాయి. ముఖ్యంగా పాలిస్టర్, సింథటిక్, నైలాన్, జార్జెట్ వంటి వస్త్రాలు ధరించినప్పుడు నిప్పు రవ్వలు తగిలితే క్షణాల్లో మంటలు అంటుకుని భారీ నష్టం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక, పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం, గేట్లు, మెట్లు వంటి మనుషులు రాకపోకలు సాగించే ఇరుకైన దారుల్లో నేలపై దీపాలు పెట్టకూడదు. పక్కన ఎత్తైన అరుగుల మీద లేదా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. దీపాలు వెలిగించేటప్పుడు, పూజలు చేసేటప్పుడు వదులుగా ఉండే సింథటిక్ చీరలు, చున్నీలకు బదులుగా కాటన్ దుస్తులు ధరించడం సురక్షితం.
బహిరంగ ప్రదేశాల్లో దీపాలు వెలిగించినప్పుడు గాలికి మంట ఎగిసి పక్కనున్న వస్త్రాలకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీపాలకు గాజు కవర్లు లేదా రక్షణ కవచాలు వాడటం మంచిది. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు దీపాల వద్దకు వెళ్లకుండా పెద్దలు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. పొరపాటున దుస్తులకు నిప్పు అంటుకుంటే కంగారుపడి పరుగెత్తకూడదు. అలా చేస్తే గాలికి మంట మరింత పెరుగుతుంది. వెంటనే నేలపై దొర్లడం లేదా మందపాటి దుప్పటి, బెడ్‌షీట్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలి.













Click it and Unblock the Notifications
