వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంపై శుభవార్త!
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంపై వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్త చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. త్వరలోనే హాస్పిటల్‌లో వైద్య సేవలు ప్రారంభించి, ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటళ్ల అభివవృద్ధిపై ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి తాజాగా సమీక్ష చేశారు.వరంగల్, హన్మకొండ సహా పలు జిల్లాల్లోని సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటల్స్‌లో డాక్టర్ల అటెండెన్స్ తక్కువగా ఉంటోందని, డీసీహెచ్‌ఎస్‌లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 90 శాతం వైద్య సేవలను స్థానికంగానే అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంతో సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లు అత్యంత కీలకం అన్నారు.

పీహెచ్సి లు, ఏరియా ఆస్పత్రుల పనితీరు మరింత మెరుగు పడాలన్నారు. ఇటీవలే సుమారు 1616 మంది డాక్టర్లను సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటల్స్‌లో నియమించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. హాస్పిటళ్లకు అవసరమైన హెచ్‌ఆర్, ఎక్విప్‌మెంట్, డ్రగ్స్, రీఏజెంట్స్ అన్నీ ఇస్తున్నామని, ఇంకేమైనా అవసరం ఉంటే కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. అవసరమైన ప్రతిపాదనలు రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు ఇవ్వాలని మంత్రి సూచించారు.
హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులను ఆకస్మిక తనిఖీలకు పంపుతామని, పేషెంట్లకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వోపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా, హిమోఫిలియా కేసులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని, ఈ అంశంపై జిల్లాస్థాయి ఆరోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
వ్యాధి నిర్మూలన కోసం ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న బస్తీ దవాఖాన్లకు నేరుగా సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచి మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాల్లోని బస్తీ దవాఖాన్లకు కూడా నేరుగా సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచే మెడిసిన్స్ పంపిణీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సబ్ సెంటర్లు అన్నింటినీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లు గా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తానని, అప్పటిలోగా హాస్పిటళ్ల పనితీరు మరింత మెరుగు అవ్వాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటళ్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు ఈలోగా సిద్ధం చేసి, ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి దామోదర దాజనర్సింహ సూచించారు.













Click it and Unblock the Notifications
