యూపీ.. రాజకీయాలను ఒంటి చేత్తో శాసించే రాష్ట్రం 600 లకు పైగా సీట్లు
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమీపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.
ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లు లోక్ సభ సమక్షానికి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. డీలిమిటేషన్ అమలు తర్వాత లోక్ సభ, అసెంబ్లీ స్థానాలపరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఆవిర్భవించబోతోంది.. ఉత్తర్ ప్రదేశ్. ఇప్పటికే 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. ఏకంగా 605 కు చేరుకోనుంది. అటు లోక్ సభ స్థానాలు కూడా 80 నుంచి 120కి చేరుకోనున్నాయి. జాతీయ రాజకీయాలను ఒంటి చేత్తో శాసించే రాష్ట్రంగా మారబోతోంది.

ఉత్తర్ ప్రదేశ్ విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే అభిప్రాయాలు గతంలో వినిపించినప్పటికీ, రాష్ట్రాన్ని విభజించకుండానే స్థానాలను పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం సవరణ బిల్లులో ఒక ప్రత్యేక నిబంధనను పొందుపరచింది. దీని ద్వారా రాష్ట్ర భౌగోళిక సరిహద్దులను మార్చకుండా, జనాభా పెరుగుదలకు అనుగుణంగా శాసనసభ స్థానాలను విస్తరించుకునేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రాన్ని విడదీయకుండా ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ఏ రాష్ట్ర శాసనసభలోనైనా సభ్యుల గరిష్ఠ సంఖ్య 500కు మించకూడదు. ఈ పరిమితి కారణంగా పెద్ద రాష్ట్రాల్లో డెలిమిటేషన్ తర్వాత సీట్లను పెంచడం సాధ్యం కావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి రాజ్యాంగ 132వ సవరణ బిల్లు ద్వారా ఈ గరిష్ఠ పరిమితిని 500 నుంచి 650కి పెంచాలని భావిస్తున్నారు. ఈ సవరణకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే రాష్ట్రాలకు తమ అసెంబ్లీ సీట్లను విస్తరించుకునే చట్టబద్ధమైన అవకాశం దక్కుతుంది.
రాష్ట్ర శాసనసభల స్థానాలే కాకుండా, లోక్‌సభ స్థానాల గరిష్ఠ పరిమితిని కూడా పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లోక్‌సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచేలా రాజ్యాంగ సవరణ తీసుకురానున్నారు. దీని ప్రకారం రాష్ట్రాల నుంచి 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది లోక్ సభకు ఎన్నికవుతారు.
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం మూడు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు కాగా, 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేయడం వీటి ప్రధాన లక్ష్యం. మూడో బిల్లు ద్వారా ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను 50 శాతం వరకు పెంచే అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయాలు దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చివేయనున్నాయి.














Click it and Unblock the Notifications
