సావర్కర్ 2.0 వచ్చాడబ్బా: ఏకిపారేస్తోన్న సీఎం విజయ్ పార్టీ
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఒకట్రెండు ప్రతిపక్ష, తటస్థ పార్టీలు కూడా బిల్లు వైపే మొగ్గు చూపుతోన్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీ డీఎంకే కూడా ఈ డీలిమిటేషన్ బిల్లు పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ఆదివారం లోక్‌సభ సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సమావేశం అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నాయకురాలు కనిమొళి దీనికి అధ్యక్షత వహించారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

డీఎంకే తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అధికారంలో ఉన్న టీవీకే మండిపడుతోంది. డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పై ఘాటు విమర్శలను సంధిస్తోంది. సెటైర్లతో విరుచుకుపడుతోంది. స్టాలిన్ ను సావర్కర్ 2.0 అభివర్ణిస్తోంది. డీలిమిటేషన్ కు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం ద్వారా డీఎంకే తన రాజకీయ విలువలు, ద్రావిడ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని ఆరోపిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ బిల్లును వ్యతిరేకించిన డీఎంకే.. ఇప్పుడు హఠాత్తుగా తన వైఖరిని మార్చుకోవడాన్ని టీవీకే తప్పుపడుతోంది. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఆర్‌ఎస్ఎస్ దుస్తులు ధరించి ఉన్నట్లు ఓ మార్ఫింగ్, కార్టూన్ ఫొటోలను టీవీకే ఐటీ వింగ్ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. సొంత రాజకీయాలు, కుటుంబ సంపదను కాపాడుకోవడానికే డీఎంకే కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిందని, ఇది సిద్ధాంతపరమైన నిర్ణయం కాదంటూ ఎద్దేవా చేసింది. డీఎంకే స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది.
పార్లమెంట్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు ఓటు వేయాలని టీవీకే సవాల్ విసిరింది. లోక్ సభలో బిల్లుపై నిర్వహించే ఓటింగ్ కు దూరంగా ఉన్నా, సభ నుంచి వాకౌట్ చేసినా బీజేపీ లొంగిపోయినట్టే అవుతుందని స్పష్టం చేసింది. అందుకే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందేనని పేర్కొంది.
சனாதானம் அல்ல...Sonதானம்... https://t.co/1LmZeyHbie
— TVK IT Wing Official (@TVKHQITWingOffl) November 28, 2026
మరోవైపు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయాన్ని స్టాలిన్ సమర్థించుకున్నారు. తమిళనాడుతో పాటు ఇతర దక్షిణ భారత రాష్ట్రాల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతోన్నామని గుర్తు చేశారు. తాము కోరిన రెండు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా సవరణ బిల్లులో చేర్చిందని వెల్లడించారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న ప్రస్తుత ప్రాతినిధ్య శాతానికి ఎలాంటి భంగం కలగకుండా చూడటంతో పాటు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచేలా కేంద్రం నూతన విధానాన్ని సిద్ధం చేసిందని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
