రైల్వే స్టేషన్‌లో దారుణం: మరుగుదొడ్డిలోకి చొరబడి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
ముంబై నగరంలోని ఘాట్‌కోపర్ రైల్వే స్టేషన్లోని పబ్లిక్ వాష్‌రూంలో 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
లోకల్ ట్రైన్ కోసం వేచి ఉన్న సమయంలో ఘటన
మహారాష్ట్రలోని థానే జిల్లా ఖడావ్లీ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల మహిళ, తన 18 ఏళ్లు కుమార్తెతో కలిసి ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘాట్‌కోపర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. లోకల్ ట్రైన్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఆ వృద్ధురాలు స్టేషన్లోని మరుగుదొడ్డికి వెళ్లారు. ఆమె మరుగుదొడ్డికి వెళ్లడాన్ని గమనించిన ఓ వ్యక్తి రహస్యంగా లోపలికి చొరబడి ఆమెపై బలవంతానికి ప్రయత్నించాడు. బాధితారాలు ప్రతిఘటించి సాయం కోసం కేకలు వేయడంతో నిందితుడు ఆమె ముఖం, ఛాతీపై తీవ్రంగా దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు.

కూతురికి విషయం చెప్పిన బాధితురాలు.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు
రక్తమోడుతూ తీవ్ర గాయాలతో వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ వృద్ధురాలు.. తన కూతురు వద్దకు వెళ్లి జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. నిందితుడు మెట్రో స్టేషన్ వైపు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. నిందితుడిని పట్టుకునేందుకు కుర్లా జీఆర్పీ 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది.
నిందితుడి వివరాలు.. మత్తుపదార్థాల కోణంలో దర్యాప్తు
పోలీసుల గాలింపులో ఘాట్‌కోపర్ వెస్ట్‌లోని అసల్పా ప్రాంతంలో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని వృతి రీత్యా దర్జీగా పనిచేస్తున్న 27 ఏళ్ల తస్లీమ్ నూర్ మహమ్మద్ షాగా గుర్తించారు. మత్తుపదార్థాల మత్తులో అతను ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్నికోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications
