తిరుమలలో 60 గ్రాముల బంగారం రికవరీ
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల భద్రతతో పాటు వారి విలువైన వస్తువుల పరిరక్షణలో టీటీడీ కమాండ్ కంట్రోల్ రూమ్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా మదనపల్లెకు చెందిన ఒక భక్తుడు పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను సీసీటీవీ కెమెరాల నిరంతర నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి రికవరీ చేసి సురక్షితంగా అందజేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతానికి చెందిన మహేష్ అనే భక్తుడు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. అక్కడి సీఆర్‌ఓ ఆఫీస్ కారులో నుంచి హడావుడి దిగే సమయంలో ఆయన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు నగలు పొరపాటున కింద జారిపడ్డాయి. కారు దిగే తొందరలో ఆభరణాలు పడిపోయిన విషయాన్ని మహేష్ గమనించలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్ద ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భక్తుడు తక్షణమే తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆశ్రయించాడు.

తన నగలు పోయిన ప్రాంతం, సమయం వివరాలను భద్రతా సిబ్బందికి తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు. భక్తుడి నుంచి సమాచారం అందుకున్న వెంటనే కమాండ్ కంట్రోల్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తమై విచారణ ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీఆర్‌ఓ ఆఫీస్ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఆధునిక సీసీటీవీ కెమెరాల ప్లేబ్యాక్ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
మహేష్ జారవిడుచుకున్న ఆభరణాలను ఇద్దరు వేర్వేరు వ్యక్తులు తీసుకున్నట్లు కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత విజువల్ ఆధారాల సహాయంతో సదరు వ్యక్తులు ఎటువైపు వెళ్లారనే కదలికలను నిరంతరం ట్రాక్ చేశారు. విచారణలో మొదటి వ్యక్తి తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన భక్తుడిగా గుర్తించిన అధికారులు, అతడి లగేజీ వివరాలు, ఫోన్ నంబర్‌ను సేకరించారు. ఆ ఆభరణాలు మరొక భక్తుడికి చెందినవని ఫోన్ ద్వారా తెలియజేసి, తిరిగి తిరుమలకు రప్పించారు.
అతడి వద్ద ఉన్న సుమారు 52 గ్రాముల బరువుగల రెండు బంగారు గొలుసులు, ఒక బంగారు బ్రాస్‌లెట్‌ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది గ్రాముల బంగారు ఉంగరాన్ని తీసుకున్న రెండో వ్యక్తి ఉచిత దర్శనం క్యూలైన్లలో ఉన్నట్లు సీసీటీవీ ప్లేబ్యాక్ ద్వారా గుర్తించారు. అతని కదలికలను పరిశీలిస్తూ నారాయణగిరి షెడ్ నంబర్ 7లో ఉన్నట్లు నిర్ధారించుకుని, భద్రతా సిబ్బంది అక్కడికి వెళ్లి అతని వద్ద ఉన్న ఉంగరాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన మొత్తం 60 గ్రాముల బంగారు ఆభరణాలను మహేష్‌కు టీటీడీ అధికారులు అందజేశారు. పోగొట్టుకున్న విలువైన నగలు కొద్ది గంటల్లోనే తిరిగి లభించడంతో అతను ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ భద్రతా వ్యవస్థ వేగవంతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లో తన ఆనందాన్ని వీడియో రూపంలో నమోదు చేశారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు వీజీఓ సురేంద్ర, ఏవీజీఓ వెంకటరమణ నేతృత్వంలోని కమాండ్ కంట్రోల్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి నగలను అప్పగించడాన్ని భక్తులు ప్రశంసించారు.














Click it and Unblock the Notifications
