‘నెట్‌ఫ్లిక్స్’లో వరల్డ్ వైడ్ నెంబర్ 1 హారర్ మూవీ
నెట్‌ఫ్లిక్స్ వేదికగా వ్యూస్ పరంగా ఆల్-టైమ్ టాప్ హారర్ థ్రిల్లర్‌గా 2018 డిసెంబర్ 21న విడుదలైన 'బర్డ్ బాక్స్'చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి 91 రోజుల్లోనే సుమారు 157.4 మిలియన్ల వ్యూస్ సాధించి, నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన హారర్ చిత్రంగా తిరుగులేని రికార్డును నెలకొల్పింది. ఆస్కార్ విజేత సాండ్రా బుల్లక్ ప్రధాన పాత్రలో, సుసాన్ బియర్ దర్శకత్వంలో సుమారు 19.8 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన తొలి 28 రోజుల్లోనే 45 మిలియన్లకు పైగా ఇళ్లల్లో వీక్షించబడి అప్పట్లో ఓటీటీ ప్రపంచంలో పెను సంచలనం రేపింది.
నవల ఆధారంగా తీశారు
జోష్ మాలెర్మాన్ రాసిన ఇదే పేరుగల నవల ఆధారంగా, ఎరిక్ హైసెరర్ అందించిన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ట్రెవాంటే రోడ్స్, జాన్ మాల్కోవిచ్, సారా పాల్సన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. కంటితో చూస్తే మనుషులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే వింత, అదృశ్య శక్తులు ప్రపంచాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ భయంకరమైన శక్తుల బారి నుంచి తన ఇద్దరు చిన్న పిల్లలను కాపాడుకోవడానికి మలోరీ హేస్ (సాండ్రా బుల్లక్) అనే తల్లి కళ్లకు గంతలు కట్టుకుని, ప్రమాదాలను ముందుగానే పసిగట్టే పక్షులను వెంటబెట్టుకుని నది గుండా సాగించే అత్యంత ఉత్కంఠభరితమైన ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేసింది.

పాప్ కల్చర్‌పై ప్రభావం
ఈ సినిమా కేవలం వ్యూస్ పరంగానే కాకుండా పాప్ కల్చర్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది. సినిమా విడుదలైన తర్వాత కళ్లకు గంతలు కట్టుకుని పనులు చేసే 'బర్డ్ బాక్స్ ఛాలెంజ్' సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా నెట్‌ఫ్లిక్స్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ చిత్రానికి లభించిన అపూర్వ ఆదరణతో 2023లో 'బర్డ్ బాక్స్ బార్సిలోనా' పేరుతో స్పిన్-ఆఫ్ సీక్వెల్ కూడా విడుదలైంది.












Click it and Unblock the Notifications
