డీలిమిటేషన్ బిల్లుపై రాష్ట్రపతి తుది నిర్ణయం: సభలో ప్రవేశపెట్టేది ఆయనే
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఒకట్రెండు ప్రతిపక్ష, తటస్థ పార్టీలు కూడా బిల్లు వైపే మొగ్గు చూపుతోన్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్), డీఎంకే.. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయబోతోంది.
ఈ నెల 30వ తేదీన ఈ బిల్లు లోక్ సభ సమక్షానికి రానుంది. ఇక్కడ ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభకు వెళ్తుంది. డిసెంబర్ 2వ తేదీన రాజ్యసభ సమావేశం కానుంది. గురువారం కూడా ఉభయసభలు కొనసాగుతాయి. ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించనున్నాయి. ఎన్సీపీ, డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఇక ఇది సభ ఆమోదం పొందడం దాదాపు లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇదే బిల్లును డీఎంకే వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాల మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ బిల్లుపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీన్ని లోక్సభ పరిశీలనకు తీసుకోడానికి అనుమతి ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117 (3) కింద ప్రత్యేకంగా ఈ బిల్లును సిఫారసు చేశారు. 30 నుండి డిసెంబర్ 3 వరకు జరగనున్న నాలుగు రోజుల లోక్సభ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన ఈ బిల్లు ముసాయిదా ప్రకారం.. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా 50 శాతం మేర పెంచాలని ప్రతిపాదించారు. జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల ప్రాతినిథ్యాన్ని పెంచడం, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడమే దీని లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సభ ముందుకు వచ్చిన తర్వాత దీనిపై విస్తృత చర్చ జరగనుంది.













Click it and Unblock the Notifications
