కార్తీకమాసం చివరి సోమవారం ఎప్పుడు
కార్తీక మాసం ఆధ్యాత్మిక శోభ, సంప్రదాయాలకు నిలయం. శరదృతువు ముగిసి శీతాకాలపు చలిగాలులు ప్రారంభం అయ్యే ఈ సమయంలో దైవచింతన విలసిల్లుతుంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉండటం వల్ల దీనికి కార్తీక మాసంగా పిలుస్తారు. ఈ నెలలో వచ్చే ప్రతి రోజూ ఎంతో పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. కార్తీకానికి ఉన్న అసలైన ప్రత్యేకత శివకేశవులిద్దరికీ అత్యంత ప్రతీకరమైనది కావడం. శివుడు, శ్రీమహావిష్ణువు ఇద్దరూ ఒక్కటేనన సత్యాన్ని ఈ మాస ఆరాధనా పద్ధతులు ప్రతిబింబిస్తుంటాయి.
ఈ మాసంలో వేకువజామున చేసే కార్తీక స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. నదీ స్నానం అందుబాటులో లేకపోతే ఇంట్లో గంగా, యమునలను స్మరిస్తూ భక్తులు స్నానాలు ఆచరిస్తారు. అనంతరం ఇంటి ముంగిట బియ్యపు పిండితో శోభాయమానమైన ముగ్గులు వేయడం, పూజా మందిరం, తులసి కోట వద్ద ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలలో దీపారాధన చేయడం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం.

రోజూ సాయంత్రం వేళల్లో గుమ్మాలకు ఇరువైపులా దీపాలు వెలిగించి సంధ్యా వందనం ఆచరిస్తారు. కార్తీక నిత్య పూజల్లో ఆడంబరం కంటే నిష్ఠ, ప్రశాంతతకే ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిరోజూ దీపారాధన అనంతరం కార్తీక పురాణంలోని ఆ రోజు అధ్యాయాన్ని చదవడం లేదా వినడం భక్తులకు ఆనవాయితీ. ఈ నెలంతా మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.
పరమశివునికి కార్తీక సోమవారాలు అత్యంత ప్రీతికరం. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసం, ఏకభుక్తం పాటిస్తూ శివాలయాల్లో జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారంగా భావించి విశేష పూజలు చేస్తారు. ఇక తెలుగు సంస్కృతిలో భాగమైన ఉసిరి వనభోజనాలు ఈ నెలకే ప్రత్యేక ఆకర్షణ. ఉసిరి చెట్టును శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించి పూజించి, తోటల్లో బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను నిర్వహిస్తారు.
ఈ కార్తీకమాసంలో చివరి సోమవారం డిసెంబర్ 7వ తేదీన రానుంది. చివరి సోమవారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో క్రిక్కిరిసిపోతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, శ్రీముఖలింగం వంటి ఆలయాలతో పాటు పంచారామాలైన ద్రాక్షారామం, అమరావతి, సోమారామం, క్షీరారామం, కుమారరామం ఆలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ మాసానికి వీడ్కోలు పలుకుతూ అమావాస్య మరుసటి వేకువజామున మహిళలు పోలి స్వర్గం నోమును ఆచరిస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలుతారు.
కార్తీక మాస వ్రతాచరణ అనేది కేవలం పూజలు, ఉపవాసాలకే పరిమితం కాకుండా మానసిక ప్రశాంతత, కుటుంబ క్షేమానికి దారితీస్తుంది. ఆడంబరాలకు దూరంగా నిష్ఠతో దైవచింతన చేయడం, శక్తి కొద్దీ దానధర్మాలు ఆచరించడం ద్వారా ఈ పవిత్ర మాసంలో పొందే ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.













Click it and Unblock the Notifications
