ఎల్బీ నగర్ లో పట్టపగలే దొంగల బీభత్సం.. ఇంట్లోకి చొరబడి మహిళలను కట్టేసి రూ. 3.2 కోట్లతో జంప్..
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి.. పగలు అని తేడా లేకుండా దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. భాగ్యనగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఈ దోపిడీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలే ఓ ఇంట్లోకి దూరిన నలుగురు దుండగులు ఇంట్లోని ఇద్దరు మహిళలను బంధించి వారి ముందే ఇంట్లోని రూ.3.2 కోట్లతో జంప్ అయ్యారు. మహిళలు కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్లు వేసి.. చేతులు కట్టేసి ఈ దారుణానికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏం జరిగింది..?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ చండీశ్వర కాలనీ ప్లాట్ నంబర్ 61 లో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కొమ్మరవెల్లి సంపత్ కుమార్ రెడ్డి.. ఇండియాలో స్థిరాస్తి కొనుగోలు కోసం రూ. 3. 20 కోట్లను బ్యాంకు ఖాతా ద్వారా తన బావ కుంభం విజయ్ కుమార్ రెడ్డికి పంపించాడు. ఆ డబ్బులను విత్ డ్రా చేసి భద్రత కోసం ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో సంపత్ కుమార్ ఉంచాడు. అయితే శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నలుగురు దొంగలు నవీన్ ఇంట్లోకి చొరబడ్డారు.

ఇంట్లో ఉన్న మణెమ్మ(65), ఆమె కోడలు మౌనికలను బంధించారు. వాళ్లను కట్టేసి, నోళ్లకు ప్లాస్టర్ వేసి అరవకుండా చేశారు. ఆ తర్వాత రూ. 3.20 కోట్లు ఎత్తుకెళ్లారు. ఇక దుండగులు వెళ్లాక మహిళలు కేకలు వేయడంతో.. పొరుగింటి వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక కచ్ఛితంగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
