డీజిల్ కాదు.. ఇథనాల్‌తో నడిచే ట్రాక్టర్!
డీజిల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న వేళ మహీంద్రా ట్రాక్టర్స్ తన తొలి ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. నాగ్ పూర్ లో నవంబర్ 27 నుంచి 30 వరకు జరుగుతున్న 'అగ్రోవిజన్ 2026' వ్యవసాయ ప్రదర్శనలో కంపెనీ దీనిని ప్రదర్శించింది. 49 హెచ్పీ సామర్థ్యం కలిగిన ఈ ట్రాక్టర్‌ను 'యువో టెక్ ప్లస్' ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ ట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఇథనాల్‌పై నడిచే ట్రాక్టర్‌ను ప్రదర్శించడం ద్వారా ఫ్యూచర్ టెక్నాలజీ దిశగా కంపెనీ అడుగులు వేసింది. ఫాడా నివేదిక ప్రకారం.. ట్రాక్టర్ల విక్రయాల్లో 99.96 శాతం డీజిల్ ఇంజిన్ ట్రాక్టర్లే అమ్ముడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ట్రాక్టర్ వ్యవసాయ రంగానికి ఓ కొత్త ఆలోచనగా నిలుస్తోంది.
మహీంద్రా ట్రాక్టర్ ప్రత్యేకతలేంటి?
ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలో మహీంద్రా చేస్తున్న ప్రయత్నాలకు ఈ ట్రాక్టర్ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రదర్శనలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో మహీంద్రా ట్రాక్టర్స్ సీఈవో హర్ష్ రాయ్ ఈ ట్రాక్టర్‌ను ప్రదర్శించారు. ఇథనాల్‌తో నడపడమే దీని ప్రధాన ప్రత్యేకత.

భవిష్యత్తులో భారత మార్కెట్లో సంప్రదాయ డీజిల్ ట్రాక్టర్లకు ఇది ఓ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ట్రాక్టర్‌ను వాణిజ్యపరంగా మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి టెక్నాలజీతో ముందుకు వెళ్తుందనే విషయాన్ని మాత్రం ఈ ప్రదర్శన ద్వారా స్పష్టం చేసింది.
ఇతర ఉత్పత్తుల ప్రదర్శన
అగ్రోవిజన్ 2026 ప్రదర్శనలో మహీంద్రా మరికొన్ని ట్రాక్టర్లను కూడా ప్రదర్శించింది. వాటిలో 50 హెచ్పీ సామర్థ్యం గల 'నోవో 605 డీఐ పీఎస్ 4 వీల్ డ్రైవ్' ట్రాక్టర్ ఒకటి. ఇది 2,700 కిలోల లిఫ్ట్ సామర్థ్యం, పార్షియల్ సింక్రోమెష్ ట్రాన్స్‌మిషన్, 12/8 ప్యాడ్ క్లచ్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీనితో పాటు 'ఓజేఏ 2130' ట్రాక్టర్‌ను కూడా కంపెనీ ప్రదర్శించింది. ఇది త్రీ-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ ఇంజిన్, 950 కిలోల లిఫ్ట్ కెపాసిటీ, పీఆర్ఓజేఏ వేరియంట్లో 12 ఫార్వర్డ్, 12 రివర్స్ గేర్లు, డిజిసెన్స్ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలతో రూపొందించబడింది.












Click it and Unblock the Notifications
