హైదరాబాద్ లో తొలి 'యాపిల్ స్టోర్'.. ఎక్కడో తెలుసా..?
మార్కెట్ లో ఇతర ఫోన్లతో పోల్చితే ఐఫోన్ కు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. లైఫ్ లో ఒక్కసారైనా ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తుంటారు. ఏది ఏమైనా చేతిలో ఐఫోన్ ఉంటే చాలు అనుకునే యువత ఇప్పుడు ఎక్కువైపోయింది. అయితే ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ అయిన యాపిల్.. హైదరాబాద్ లో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని వై జంక్షన్ వద్ద ఉన్న లేక్ షోర్ మాల్ లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ డిసెంబర్ 10 న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని యాపిల్ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. యాపిల్ సంస్థ మన దేశంలో ప్రారంభించబోతున్న ఏడో రిటైల్ స్టోర్ ఇదే కావడం విశేషం.
ఇక యాపిల్ కు ఇప్పటివరకు దేశంలో ఆరు అధికారిక రిటైల్ స్టోర్లు ఉన్నారు. దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె నగరాల్లో ఈ స్టోర్లు ఉన్నాయి. అయితే దిల్లీ రెండు, ముంబైలో రెండు యాపిల్ స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తగా యాపిల్ స్టోర్ రానున్న క్రమంలో మన దేశంలో మొత్తం యాపిల్ రిటైల్ స్టోర్ లు ఏడుకు చేరాయి. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు కానున్న స్టోర్ లో యాపిల్ ఉత్పత్తులన్నింటినీ విక్రయించనున్నారు. అలాగే కంపెనీ అందించే సేవలు.. కస్టమర్ సపోర్ట్ ను కూడా ఇక్కడ నేరుగా పొందే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో యాపిల్ కొత్త స్టోర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఫోన్ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో కొత్త స్టోర్ వల్ల కస్టమర్లు యాపిల్ ఫోన్ లను దగ్గర్నుంచి చూసి వాటి గురించి తెలుసుకుని కొనుగోలు చేయవచ్చు. ఇక సైబర్ మీడియా రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 మూడో త్రైమాసికంలో భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 బ్రాండ్స్ లో యాపిల్ కూడా చేరింది. అలాగే దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో యాపిల్ కు 9 శాతం వాటా ఉంది.












Click it and Unblock the Notifications
