భారత్ ఆతిథ్యం చూసి ఫిదా అయ్యా!: పాక్ మంత్రి ప్రశంసల వర్షం!
షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సు కోసం ఇటీవల ఢిల్లీకి వచ్చి వెళ్లిన పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్.. స్వదేశానికి చేరుకున్న తర్వాత తన వైఖరిని మార్చుకుంటూ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఆన్ కెమెరా మాటలకు.. ఆఫ్ ది రికార్డు సంభాషణలకు ఎంతో తేడా ఉందని పేర్కొన్న ఆయన.. ఇండియాలో తమకు అద్భుతమైన ఆతిథ్యం లభించిందని వెల్లడించారు.
గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ముసాదిక్ మాలిక్ వేరే విధంగా మాట్లాడారు. ఇండియాలో పాకిస్థాన్ పట్ల ఇంతటి ద్వేషం ఉంటుందని తాను ఊహించలేదని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో తన పర్యటనపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆసక్తికరంగా సాగిన ఆఫ్ కెమెరా చర్చలు
కొత్తగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ.. "ఆన్ కెమెరా జరిగే కఠినమైన మాటలను.. ఆఫ్ కెమెరా జరిగిన సంభాషణలతో పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. నేను కలిసిన వ్యక్తులతో జరిగిన మాటలు చాలా ఆసక్తికరంగా సాగాయి" అని చెప్పారు. అమీర్ ఖుస్రో, మీర్జా గాలిబ్, నిజాముద్దీన్ ఔలియా దర్గా వంటి వారసత్వం ఉన్న చోట ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్‌లో మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తూ.. అక్కడ ఉర్దూలో తమ సొంత భాషలోనే మాట్లాడాలని వ్యాఖ్యానించారు. భారత్‌లో కలిసిన పలువురు వ్యక్తులు తమ పుస్తకాలను బహుమతిగా ఇచ్చారని.. వాటిని తాను వెంట తీసుకొచ్చానని తెలిపారు. దీనిని బట్టి తమకు ఎంతో మంచి ఆతిథ్యం లభించిందని అర్థమవుతోందని పేర్కొన్నారు.
సానుకూలంగా జరిగిన చర్చలు
ద్వైపాక్షిక అంశాలపై స్పందిస్తూ షాంఘై సహకార సంస్థ వేదికగా తమకు ఆహ్వానం అందిందని.. తాము ఎస్సీవో అంశాలపైనే చర్చించామని పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చెప్పారు. భారత ప్రతినిధులు కూడా షాంఘై సహకార సంస్థకు సంబంధించి ప్రాంతీయ అంశాలపై మాట్లాడారని.. అయితే చర్చలు ఎంతో సానుకూలంగా సాగాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే మూడు అంశాలపై ఏకాభిప్రాయం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సార్వభౌమత్వం మొదటి స్థానంలో, గౌరవం రెండో స్థానంలో, సమగ్రత మూడో స్థానంలో ఉంటాయని పేర్కొంటూ.. ఈ మూడు అంశాలను ముందుపెట్టి చర్చలు ప్రారంభిస్తే ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చని అన్నారు.














Click it and Unblock the Notifications
