850 సీట్ల వెనుక బీజేపీ అసలు ప్లాన్ ఇదేనా? మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచేందుకు సిద్ధమవుతున్నారని.. బీజేపీకి అనుకూలంగా దేశ రాజకీయ, ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శనివారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడవచ్చన్న భావన పాతబడిపోయిందని అన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న విషయం దేశ ప్రజలకు తెలుసని.. తమ సర్వేల ప్రకారం 80 శాతం మంది భారతీయులు దాదాపు 100 శాతం జెన్ జెడ్ వర్గం నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికలను తారుమారు చేస్తున్నారని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మరో కొత్త ప్రణాళికతో ముందుకొచ్చారని విమర్శించారు.

డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ.. ఇది బీజేపీకి తప్పించుకునే కొత్త మార్గమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీని స్వరూపం, పరిణామాల గురించి వివరిస్తూ.. 2024లో అనర్హులైన 14 కోట్ల మంది ఓటు వేశారని ఎన్నికల సంఘమే చెప్పిందని.. ఆ లెక్కన 2024 ఎన్నికలే చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేశారని, బీహార్‌లో ఓటర్ల పేర్లు తొలగించారని.. అసోంలో బీజేపీకి అనుకూలంగా రాష్ట్ర స్వరూపాన్ని మార్చారని.. పశ్చిమ బెంగాల్‌లో 100కు పైగా సీట్లు దక్కించుకున్నారని ఆరోపించారు. ఓట్ల చోరీ విషయంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ లను ఇరుకున పెట్టామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన కీలక సమాచారం తమ వద్ద ఉందని.. త్వరలోనే ఆ వివరాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.
ఎన్నికల మ్యాప్ మార్చే కుట్ర
లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని.. ఇందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని.. రేపే దాన్ని అమలు చేయవచ్చని అన్నారు. మరి 850 సీట్లు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. అసోం, జమ్మూకశ్మీర్‌లలో దీని సమాధానం ఉందని చెప్పారు. 850 సీట్లు ఉంటే భారత ఎన్నికల పటంలో భారీ మార్పులు చేసి దాన్ని పూర్తిగా తిరగరాసే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బీజేపీ తనకు లాభం చేకూరేలా ఎన్నికల మ్యాప్‌ను మార్చుకోవాలనుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరచడంతో పాటు విపక్షంలోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications
