భూమిలో దాగున్న బంగారు ఖజానా.. ఏకంగా రూ.27 లక్షల కోట్లు!
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు నిత్యం చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. చైనా నుంచి వెలువడిన ఓ అంశం భూగర్భ శాస్త్రవేత్తలు, గనుల నిపుణుల దృష్టిని ఆకర్షించింది. చైనాలోని రెండు ప్రావిన్సుల్లో భూగర్భంలో భారీ బంగారు నిల్వలు బయటపడ్డాయి. ఈ రెండు నిల్వలలో కలిపి 2,000 మెట్రిక్ టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని అంచనా. 2026 నవంబర్ చివరి నాటికి బంగారం ధరల ఆధారంగా వీటి సైద్ధాంతిక మార్కెట్ విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.27 లక్షల కోట్లు) ఉంటుందని లెక్కగట్టారు.
వీటిలో అతిపెద్ద నిల్వ లియానింగ్ ప్రావిన్స్ లోని దాదోంగ్‌గౌ ప్రాంతంలో లభించగా.. రెండో భారీ నిల్వ హునాన్ ప్రావిన్స్‌లోని వాంగులో ఉంది. దాదోంగ్‌గౌ బంగారం జాడలు దశాబ్ధాల క్రితమే కనిపించినప్పటికీ.. ఆ సమయంలో సైంటిస్టులు, అన్వేషకులు వాటిని ఆర్థికంగా ఉపయోగపడేవిగా భావించలేదు. నవంబర్ 2025లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక అంచనా ప్రకారం.. లియానింగ్ ప్రావిన్స్‌లోని దాదోంగ్‌గౌలో 1,444 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. 1949 తర్వాత చైనాలో కనుగొన్న అతిపెద్ద ఏకైక బంగారు నిల్వ ఇదేనని చెబుతున్నారు. మరోవైపు హునాన్ ప్రావిన్స్‌లోని వాంగులో 1,000 టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని అంచనా వేశారు. అయితే వాంగులో 1,000 టన్నుల లెక్క ఇంకా అంచనా దశలోనే ఉందని.. దానిని నిర్ధారించుడానికి మరిన్ని డ్రిల్లింగ్స్, భూగర్భ సర్వేలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

2026 నవంబర్ చివరి నాటికి ట్రాయ్ ఔన్స్ బంగారం ధర సుమారు 3,550 డాలర్లుగా పరిగణిస్తే.. దాదోంగ్‌గౌ బంగారం సైద్ధాంతిక విలువ దాదాపు 165 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. వాంగులోని బంగారం నిల్వల విలువ దాదాపు 114 బిలియన్ డాలర్లు ఉండవచ్చు. రెండింటినీ కలిపితే ఈ మొత్తం దాదాపు 279 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.25 లక్షల కోట్ల నుంచి రూ.27 లక్షల కోట్ల వరకు) చేరుతుంది. అయితే ఇది భూగర్భంలో ఉన్న మొత్తం బంగారం అంచనా మార్కెట్ విలువ మాత్రమేనని.. చైనారు వచ్చే నిజమైన ఆదాయం కాదని గమనించాలి. తవ్వకాలు, ప్రాసెసింగ్, రవాణా, ఇతర ఖర్చు తీసివేసిన తర్వాతే అసలు ఆర్థిక ప్రయోజనం తెలుస్తుంది. ఈ నిల్వల విలువ ఆఫ్రికాలోని పలు దేశాల రెండు నుంచి మూడేళ్ల ప్రభుత్వ ఖర్చులకు సరిపోయేంత స్థాయిలో ఉంది.
దశాబ్ధాల నాటి జాడ.. బంగారు గనిగా ఎలా మారింది?
దాదోంగ్‌గౌ ఆవిష్కరణ వెనుక ఆసక్తికర కథ ఉంది. 1980వ దశకంలో ఈ ప్రాంతంలోని రాళ్లలో బంగారం తాలూకు చిన్న చిన్న ఆనవాల్లు కనిపించాయి. అప్పట్లో వాటిని విడివిడిగా ఉన్న తక్కువ పరిమాణ నిల్వలుగా భావించి.. ఆర్థికంగా లాభదాయకం కాదని పక్కన పెట్టారు. కానీ ఆ తర్వాత శాస్త్రవేత్తలు మళ్లీ పరిశీలించగా.. ఆ చెదురుమదురు ఆనవాళ్లన్నీ ఒకే పెద్ద, నిరంతరాయంగా విస్తరించిన ఖనిజ ప్రాంతానికి చెందినవని తేలింది. ఈ ఖనిజ ప్రాంతం దాదాపు 3,000 మీటర్ల పొడవు, 1,500 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. కొత్త సర్వేలో చేపట్టిన డ్రిల్లింగ్ పరీక్షలలో ప్రతి బోర్‌హోల్ నుంచీ బంగారం ఆనవాళ్లు లభించాయి. 2025 నవంబర్‌లో డ్రిల్లింగ్ ఆధారంగా 1,444 టన్నుల బంగారు వనరును చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. చైనా మైనింగ్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయిగా నిలిచింది.
తక్కువ గ్రేడ్ అయినా లాభదాయకమేనా?
దాదోంగ్‌గౌలో బంగారం పరిమాణం భారీగా ఉన్నప్పటికీ.. రాళ్లలో బంగారం సాంద్రత తక్కువగా ఉండటం ఒక సవాలు. సగటున ఓ టన్ను రాయిలో సుమారు 0.56 గ్రాముల బంగారం లభిస్తోంది. దీనిని 'లో-గ్రేడ్ గోల్డ్ డిపాజిట్' అంటారు. అయినప్పటికీ ఇది ఆర్థికంగా కీలకమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. ప్రాథమిక ప్రాసెసింగ్ పరీక్షలలో బంగారాన్ని వెలికితీసే సక్సెస్ రేటు 65 నుంచి 91 శాతం వరకు నమోదైంది. పైగా ఇది 'ఓపెన్-పిట్ మైనింగ్'కు అనుకూలంగా ఉండటంతో ఆధునిక సాంకేతికతతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపితే తగినంత బంగారం పొందవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం
ఆభరణాలతో పాటు పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల నిల్వలు, కొన్ని పారిశ్రామిక రంగాల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలోని ప్రధాన బంగారు ఉత్పత్తి దేశాలలో చైనా ఒకటి. ఈ భారీ నిల్వలతో భవిష్యత్తులో దేశీయ బంగారం ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. అయితే భూగర్భంలో ఉన్న బంగారం మొత్తం తక్షణమే మార్కెట్లోకి రాదు. గనుల అభివృద్ధి, పర్యావరణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, భారీ పెట్టుబడులు అవసరం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వెంటనే పడిపోతాయని చెప్పలేం. సాంప్రదాయ గనులకు భిన్నమైన రాతి నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లోనూ బంగారం కోసం అన్వేషించేందుకు ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలు చూపుతోంది.














Click it and Unblock the Notifications
