ఇకపై స్కూల్స్ లో బురఖా, నిఖాబ్ బ్యాన్.. కీలక బిల్లుకు ప్రభుత్వం ఆమోదం..
ఇటలీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్కరణల్లో భాగంగా పాఠశాలల్లో ఇకపై బురఖా, నిఖాబ్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ కీలక బిల్లుకు ఇటలీ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని యూరో న్యూస్ ధృవీకరించింది. పాఠశాలల్లో ఉన్నప్పుడు విద్యార్థులు ఇకపై ముఖానికి అడ్డుగా బురఖా, నిఖాబ్ లాంటివి ధరించడాన్ని నిషేధిస్తూ కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ఇటలీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, మైనారిటీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది మతపరమైన స్వేచ్ఛ కు విఘాతం కలిగించడమేనని ఆరోపిస్తున్నాయి. అలాగే ఇటలీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పాఠశాలల్లోని మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేస్తూ విద్యా సంస్కరణల్లో మరో కీలక నిబంధనను చేర్చారు. అయితే ఇప్పటికే ఇటాలియన్ భాషపై పట్టు పెంచుకున్న విద్యార్థులకు ఈ 30 శాతం పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇక తాజా చట్టం ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో విద్యార్థులు బురఖా, నిఖాబ్ ధరిస్తే వారికి సుమారు 1,100 అమెరికన్ డాలర్ల జరిమానా విధించనుంది ఇటలీ ప్రభుత్వం. ఒకవేళ సదరు విద్యార్థి మైనర్ అయితే వాళ్ల తల్లిదండ్రులు, గార్డియన్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిబంధనలను మార్చింది. ఇక ఇటలీలోని పాఠశాలల్లో విదేశీ విద్యార్థుల పరిమితిపైనా ప్రతిపక్షాలు జార్జియా మెలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. విదేశీ విద్యార్థులు, ముస్లిం విద్యార్థులపై అణచివేతగా అభివర్ణిస్తున్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలకు పట్టించుకోకుండా విద్యార్థుల మధ్య విభజన సృష్టిస్తోందని మండిపడ్డాయి.

ఇక తాజాగా ఈ బిల్లుకు ఇటలీ దిగువ సభ అయిన ఛాంబర్ ఆఫ్ డ్యూటీస్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 142 మంది ఓటు వేశారు. అలాగే ప్రతికూలంగా 112 మంది ఓటు వేశారు. మరో నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇక అంతకుముందు నవంబర్ 20న సెనేట్ ఈ బిల్లుకు ఆమెదం తెలిపిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
