ఇన్‌స్టా లో రిచ్ డాక్టర్ గా పరిచయం.. పెళ్లి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో.. రూ.10 లక్షలతో జంప్..!
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా మంది గంటల తరబడి ఇన్ స్టా, ఫేస్ బుక్ కు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పరిచయమై.. ఆ తర్వాత మాయమాటలు చెప్పి అందినకాడికి లాగించేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో ఘరానా మోసం బయటపడింది. ఇన్ స్టా గ్రామ్ లో నకిలీ ఖాతా సృష్టించిన ఓ వ్యక్తి తాను రిచ్ డాక్టర్ నంటూ పరిచయం చేసుకున్నాడు. అలా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి టోకరా వేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ. 10 లక్షల రూపాయల వరకు కాజేశాడు.
అంతేకాక తన కుటుంబంలో అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటూ ఆ యువతి నుంచి నగదుతో పాటు బంగారు ఆభరణాలను కూడా తీసుకున్నాడు. అక్కడికి ఆగకుండా చివరకు క్రెడిట్ కార్డు ఓటీపీలను దుర్వినియోగం చేసి మరో రుణం పొందాడు. ఈ ఘరానా మోసంలో నిందితుడికి అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లీ కుమారుడిని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు జాజుల గునవంత్ గా పోలీసులు గుర్తించారు. అతని తల్లి సురేఖగా తేల్చారు. తల్లీకొడుకులు కావాలనే ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పి నగదు కాజేసినట్లు విచారణలో తెలుసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించి దాదాపు రూ. 10 లక్షలకు పైగానే దోచుకున్నారు. అలాగే బాధితురాలి హెచ్ డీఎఫ్సీ క్రెడిట్ కార్డును తీసుకుని.. ఓటీపీలను దుర్వినియోగం చేసి రూ.2.16 లక్షల రుణం పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఇక వీరి ఘరానా మోసంతో ప్రమేయం ఉన్న మరో నిందితుడు గునవంత్ బంధువు బొరుగుంట లోకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications
