మీ ఇంటి పండుగగా భావించండి: టీటీడీ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచీ పద్మావతి అమ్మవారిని దర్శించడానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లను చేపట్టింది. ఈ బ్రహ్మోత్సవాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా ఆలయంలో ఆ రోజున నిర్వహించబోయే అన్ని రకాల ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగే 5వ తేదీ మొదలుకుని 16 వరకు ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి.

ఈ ఏర్పాట్లపై టీటీడీ జేఈఓలు డాక్టర్ ఏ శరత్, ప్రభల గోపీనాథ్ సమీక్ష నిర్వహించారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, పుష్పాలంకరణ తదితర విభాగాల పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆలయ పరిసరాలు, వాహన సేవలు జరిగే మార్గాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతులు కల్పించాలని, హోల్డింగ్ పాయింట్ల వద్ద అన్నప్రసాదం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమానికి సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు శరత్ తెలిపారు. అధికారులు పరస్పర సమన్వయం, సమష్టి కృషితో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈసారి తిరుచానూరు ఆలయంతో పాటు తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
తిరుపతివాసులందరూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను తమ ఇంటి పండుగగా భావించాలని, భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని జేఈఓ శరత్ కోరారు. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే పంచమితీర్థం రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు శరత్ పేర్కొన్నారు. అమ్మవారి ఆవిర్భావ మహోత్సవానికి ప్రతీకగా నిర్వహించే పంచమితీర్థంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.














Click it and Unblock the Notifications
