Moral Stories: వంద బంగారు నాణేలను బీర్బల్ ఎలా పంచాడు..? అక్బర్ ప్రశంసలు
చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని మంత్రి బీర్బల్ తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో అందరి నుంచి ప్రశంసలు పొందేవాడు. అయితే బీర్బల్ ను చూసినప్పుడు అక్బర్ బావమరిదికి అసూయ కలిగేది. ఎలాగైనా మంత్రి పదవి నుంచి బీర్బల్ ను తప్పించి ఆ స్థానాన్ని తాను భర్తీ చేయాలని కుతంత్రాలు చేస్తూ ఉండేవాడు. ఇదిలాఉండగా ఓ రోజు అతను అక్బర్ చక్రవర్తి దగ్గరకు వెళ్లి.. బీర్బల్ ను మంత్రి పదవి నుంచి తీసివేయాలని.. ఆ పదవి తనకు ఇవ్వాలని కోరాడు. తాను బీర్బల్ కంటే సమర్థవంతంగా పని చేస్తానని నమ్మకంగా తెలిపాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న బీర్బల్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి రాజభవనాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దాంతో అక్బర్ తన బావమరిదిని కొత్త మంత్రిగా నియమిస్తాడు.
అయితే ఓ రోజు కొత్త మంత్రి సామర్థ్యాన్ని పరిశీలించాలని అక్బర్ నిర్ణయించుకుంటాడు. వెంటనే అతన్ని పిలిపించి 300 బంగారు నాణేలు ఇచ్చి ఇలా చెప్పాడు. " ఈ 300 బంగారు నాణేలను మూడు విధాలుగా ఖర్చు చేయాలి. మొదటి 100 నాణేలు నాకు ఈ లోకంలో ఉపయోగపడాలి.. అలాగే రెండో 100 నాణేలు పరలోకంలో నాకు ఉపయోగపడాలి. ఇక మూడో 100 నాణేలు ఈ లోకంలోనూ పరలోకంలోనూ నాకు ఉపయోగపడకూడదు" అని తెలిపాడు. అయితే చక్రవర్తి అక్బర్ ఏం చెప్పాడో కొత్త మంత్రికి అర్థం కాలేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం రాత్రింబవళ్లు ఆలోచించసాగాడు. ఈ క్రమంలో కొత్త మంత్రి సతీమణి సలహా మేరకు బీర్బల్ సాయం కోరుతాడు కొత్త మంత్రి.
అప్పుడు బీర్బల్.. ఆ 300 బంగారు నాణేలు తనకు ఇవ్వాలని అంటాడు. ఇక ఆ నాణేలతో బీర్బల్ నగర వీధుల వెంట తిరగడం ప్రారంభించాడు. అలా ఓ చోట ఓ ధనవంతుడైన వ్యాపారి తన కుమారుడి వివాహాన్ని ఘనంగా జరుపుకుంటూ కనిపించాడు. అప్పుడు బీర్బల్ అతని వద్దకు వెళ్లి 100 నాణేలు ఇచ్చి ఇలా అన్నాడు. " మీ కుమారుడి వివాహం సందర్భంగా అక్బర్ చక్రవర్తి మీకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలిపాడు. చక్రవర్తి తరఫున ఈ కానుకను స్వీకరించండి" అని అన్నాడు. దాంతో వ్యాపారి ఎంతో సంతోషించాడు. బీర్బల్ ను ఘనంగా సత్కరించి చక్రవర్తికి కానుకగా విలువైన బహుమతులు.. అలాగే సంచి నిండా బంగారు నాణేలు ఇచ్చి పంపించాడు.
ఇప్పుడు బీర్బల్ రాజ్యంలోని పేదలు ఉన్న చోటుకు వెళ్లి చక్రవర్తి పేరుమీద మరో 100 నాణేలతో వారికి ఆహారం, దుస్తులు పంచి పెట్టాడు. ఆ తర్వాత నగరానికి వచ్చి సంగీత, నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని కోసం మరో 100 బంగారు నాణేలను ఖర్చు చేశాడు. ఆ తర్వాత చక్రవర్తి అక్బర్ వద్దకు బీర్బల్ వెళ్లి.. మహారాజా.. మీరు మీ బావమరిదికి అప్పజెప్పిన పనిని నేను పూర్తి చేశాను అని చెప్తాడు. దానికి బీర్బల్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎలా సాధ్యం అని అంటాడు.
అప్పుడు బీర్బల్.. మహారాజా.. వ్యాపారి కుమారుడికి ఇచ్చిన 100 నాణేలు తిరిగి మీకు బహుమతుల రూపంలో వచ్చాయి కాబట్టి అవి ఈ లోకంలో ఉపయోగపడ్డాయి. ఇక పేద ప్రజలకు ఆహారం, దుస్తుల కోసం ఖర్చు చేసిన 100 బంగారు నాణేలు మీకు పరలోకంలో పుణ్యఫలంగా లభిస్తాయి. ఇక సంగీతం, నృత్య కార్యక్రమం కోసం ఖర్చు చేసిన మిగిలిన 100 బంగారు నాణేలు ఈ లోకంలోనూ.. పరలోకంలోనూ తిరిగి ఉపయోగపడవు" అని తెలిపాడు. ఇక బీర్బల్ సమాధానం విన్న అక్బర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఇక తన తప్పును గ్రహించిన అక్బర్ బావమరిది తన మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. దాంతో అక్బర్ తిరిగి బీర్బల్ ను ఆ పదవిలో నియమిస్తాడు.

నీతి: డబ్బును ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మనం స్నేహితులకు.. ఇతరులకు చేసే సాయం ఏదో ఒక రూపంలో తిరిగి మనకు లభిస్తుంది. అలాగే పేదలకు.. అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తే మనకు పుణ్యం, దేవుని ఆశీస్సులు లభిస్తాయి. కేవలం వినోదం, విలాసాల కోసం ఖర్చు చేసే డబ్బు త్వరగా వృథా అవుతుంది.












Click it and Unblock the Notifications
