ఆంత్రోపిక్ తరహాలోనే ఓపెన్ ఏఐకీ ట్రంప్ షాక్..! ఏం జరుగుతోంది ?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ప్రభుత్వం తన పట్టును మరింత బిగిస్తోంది. ప్రముఖ చాట్‌బాట్ సంస్థ ఓపెన్ఏఐ (Open AI)ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న సరికొత్త మోడల్ 'జీపీటీ-5.6’ (GPT-5.6) విడుదలను పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. కేవలం ప్రభుత్వం ఆమోదించిన భాగస్వాములకు మాత్రమే దీన్ని అందుబాటులోకి ఉంచాలని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇందుకు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా అంగీకరించారు.
ఓపెన్ ఏఐకి షాక్
ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రకారం, ఈ మోడల్‌ను పరిశీలించేందుకు వైట్ హౌస్‌కు చెందిన నేషనల్ సైబర్ డైరెక్టర్ కార్యాలయంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ విభాగానికి అనుమతి లభించింది. వాణిజ్య విభాగం కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ నేతృత్వంలో ఈ కంపెనీ కొత్త సాంకేతికతను కూలంకషంగా పరీక్షించిన తర్వాతే దీని విడుదలకు మార్గం సుగమం కానుంది. తమకు ఇది ఇష్టమైన మార్గం కాకపోయినా ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నట్లు సామ్ ఆల్ట్‌మన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు.

ఆంత్రోపిక్ తో పోలిస్తే ఊరట
అయితే, మరో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌తో పోలిస్తే ఓపెన్ఏఐకి కొంత ఊరట లభించిందనే చెప్పాలి. ఇటీవల ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఫేబుల్ 5, మైథోస్ 5 మోడళ్లను అమెరికా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఆ సంస్థకు కేవలం 90 నిమిషాల సమయం ఇచ్చి ఆ మోడళ్లను వెనక్కి తీసుకెళ్లేలా చేశారు. కానీ, ఓపెన్ఏఐ మాత్రం ప్రభుత్వ పర్యవేక్షణలో తన వినియోగదారుల జాబితాను నిర్వహించుకునేందుకు అనుమతి పొందింది.
కొత్త నిబంధనలతో పరిశ్రమలో ఆందోళన
ట్రంప్ యంత్రాంగం జూన్ 2న జారీ చేసిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఏఐ ల్యాబ్‌లు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి 30 రోజుల ముందే ప్రభుత్వానికి సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు స్వచ్ఛందమైనవే అయినప్పటికీ, వాటి అమల్లో స్పష్టత లేకపోవడంతో సాంకేతిక రంగానికి చెందిన కంపెనీలు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి దిగ్గజాలపై కూడా ప్రభుత్వం ఇటువంటి కఠినమైన పర్యవేక్షణే ఉంచడానికి ప్రయత్నిస్తోంది.

తప్పని ఎదురుచూపులు
ఏఐ మోడళ్ల ద్వారా సైబర్ నేరగాళ్లు లేదా ఇతర శత్రు దేశాల హ్యాకర్లు సాఫ్ట్‌వేర్ భద్రతా లోపాలను సులభంగా గుర్తించి సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉండటంతో అమెరికా రక్షణ పరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. పరిమిత భాగస్వాములతో ఈ ట్రయల్స్ ముగిసిన కొన్ని వారాలకే ఓపెన్ఏఐ తన నూతన మోడల్ జీపీటీ-5.6ను సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆల్ట్‌మన్ యోచిస్తున్నారు. కాకపోతే, అమెరికా ప్రభుత్వ పర్యవేక్షక తనిఖీలు పూర్తిగా ముగిసే వరకు ఈ ఎదురుచూపులు కంపెనీకి తప్పేలా లేవు.














Click it and Unblock the Notifications