5 రోజులు ఆడిన మహేష్ బాబు సినిమా ఉంది తెలుసా?
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా చిత్రం 'బ్రహ్మోత్సవం' సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఊహించని భారీ పరాజయంగా నిలిచింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి అద్భుతమైన విజయం తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కావడం, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత సుభాష్‌లతో పాటు సత్యరాజ్, రేవతి, రావు రమేష్ లాంటి భారీ తారాగణం నటించడంతో మే 20, 2016న విడుదలైన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పివిపి సినిమా బ్యానర్‌పై పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ పాటలు, గోపి సుందర్ నేపథ్య సంగీతం అందించారు.
కుటుంబ అనుబంధాలతో
కుటుంబ అనుబంధాలు, సొంత మూలాల వేట అనే ఆసక్తికరమైన పాయింట్‌తో రూపుదిద్దుకున్నప్పటికీ, తెరపై దాన్ని చూపించడంలో దర్శకుడు తీవ్రంగా విఫలమయ్యారు. కథనంలో స్పష్టత లేకపోవడం, నిదానంగా సాగే సన్నివేశాలు, మితిమీరిన నాటకీయత ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. స్క్రీన్‌పై డజన్ల కొద్దీ ప్రముఖ నటీనటులు ఉన్నప్పటికీ, ఏ పాత్రకూ బలమైన సంఘర్షణ లేదా సరైన ప్రాధాన్యత లభించలేదు. మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. దాంతో 3 రోజులు ముగిసేసరికే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఎవరూ రాకపోవడంతో 5వ రోజుకల్లా చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేశారు.

విడుదలకు ముందే రూ.70 కోట్ల బిజినెస్
విడుదలకు ముందు దాదాపు రూ. 70 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై బయ్యర్లకు 50 శాతానికి పైగా భారీ నష్టాలను మిగిల్చింది. కలెక్షన్లు పూర్తిగా పడిపోయి, మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా ఫలితం పట్ల మహేష్ బాబు స్వయంగా విచారం వ్యక్తం చేస్తూ, అభిమానులను నిరాశపరిచినందుకు బాధ్యత వహించారు. భవిష్యత్తులో సినిమా చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ సరిచూసుకోవడంతోపాటు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. కానీ గుంటూరు కారం సినిమా విషయంలో మరోసారి ఫెయిలయ్యారు. అభిమానులను నిరాశపరిచారు.














Click it and Unblock the Notifications