అప్పుడు చనిపోతా అనుకున్నా - సైఫ్
సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్‌లో నవాబ్ కుటుంబ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, కామెడీ పాత్రల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా వరుస విజయాలు అందుకున్న సైఫ్.. గత కొన్నేళ్లుగా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
కాగా హీరోగా వరుసగా సినిమాలు చేసిన ఆయన.. తర్వాత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కూడా మెప్పించారు. ముఖ్యంగా అజయ్ దేవగణ్ నటించిన 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' చిత్రంలో ఆయన పోషించిన ఉదయ్ భాన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా సైఫ్ బాగా పరిచయమే. ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'లో రావణుడి పాత్రలో.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర'లో ప్రతినాయకుడిగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2025 జనవరిలో ఆయన ఇంట్లో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత తొలిసారి ఆ భయానక రాత్రి గురించి సైఫ్ అలీ ఖాన్ భావోద్వేగంగా స్పందించారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 2025 జనవరి 16 రాత్రి జరిగిన భయానక ఘటనను సైఫ్ అలీ ఖాన్ తొలిసారి గుర్తు చేసుకున్నారు. ఆ రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా, ఇంట్లో పనిచేసే ఆయా భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి.. జేహ్ గదిలోకి ఓ వ్యక్తి కత్తితో ప్రవేశించి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని చెప్పిందన్నారు. ఆ మాట విన్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుమారుడి గదిలోకి వెళ్లినట్లు తెలిపారు.
ఆయన ఏమన్నారంటే.. గదిలోకి వెళ్లగానే దుండగుడు జేహ్‌కు చాలా దగ్గరగా ఉన్నాడు. నా బిడ్డను కాపాడాలి అనుకోని వెంటనే అతడిపైకి దూకాను. కానీ అతడు విచక్షణారహితంగా కత్తితో నాపై దాడి చేశాడు. నా శరీరంపై వరుసగా కత్తిపోట్లు పడ్డాయి. నా తెల్లటి కుర్తా, పైజామా పూర్తిగా రక్తంతో తడిసిపోయాయి. అప్పుడు నేను బతుకుతానో లేదో.. చనిపోతానేమో అనిపించింది" అని సైఫ్ భావోద్వేగంగా వివరించారు.
అనంతరం కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన అనంతరం ముంబై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి, బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దాడి చేసిన వ్యక్తిని క్షమించగలరా? అనే ప్రశ్నకు కూడా ఆయన బదులిస్తూ.. క్షమించాలని ఉంది కానీ అతడు చేసిన పని చాలా పెద్ద నేరం అంటూ ఓపెన్ అయ్యారు.
మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా సైఫ్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్న ఆయనకు కుమార్తె సారా అలీ ఖాన్, కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోగా, సైఫ్ ప్రముఖ నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ (జేహ్) అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక పెద్ద కుమారుడు ఇబ్రహీం, కుమార్తె సారా తండ్రి బాటలోనే సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications