రియల్ అఘోరీలతో మహా కుంభ మేళాలో అఖండ 2 షూటింగ్
Maha Kumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.
కోట్లాదిమంది..
ఈ నెల 13వ తేదీన మహా కుంభ మేళా ఆరంభం కాగా.. తొలి మూడు రోజుల్లో నాలుగు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు తెలుస్తోంది. ఒక్క మకర సంక్రాంతి రోజైన ఈ నెల 14వ తేదీ నాడే కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

అమృత ఘడియల్లో..
మహా కుంభ మేళా మరుసటి రోజును అమృత పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మకర సంక్రాంతి పండగ కూడా తోడు కావడంతో లక్షలాది మంది భక్తులు, సాధవులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ తెల్లవారు జాము నుంచే ఈ ప్రదేశం మొత్తం జనసంద్రంగా మారింది.
బోయపాటి మకాం..
ఇదిలా వుండగా- ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారు. అక్కడే మకాం వేశారు. ఈ నెల 11వ తేదీ నాడే ఆయన ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లారు. మహా కుంభ మేళాను తెరకెక్కిస్తోన్నారు. ఈ క్రమంలో కొంతమంది అఘోరీలు, నాగ సాధువులపై సమగ్రంగా అధ్యయనం చేస్తోన్నారని తెలుస్తోంది.
అఖాడాలతో..
సన్యాసి (శైవం), బైరాగి (వైష్ణవం), ఉదాసీన్ అఖాడా, శ్రీ పంచ్ దర్శనం, జునా అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాని, శ్రీ శంభు పంచాగ్ని అఖాడ, శ్రీ పంచదర్శనం ఆవాహన్ అఖాడా, తపోనిధి శ్రీ ఆనంద్ అఖాడాలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడుతున్నారని సమాచారం.

అఖండ 2 సీన్లు..
ప్రస్తుతం బోయపాటి శ్రీను.. అఖండ 2ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారీ మూవీలో. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందీ సినిమా.
ప్రధాన తారాగణం..
ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించబోతోన్నారు బోయపాటి శ్రీను. ఈ క్రమంలో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తోన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచే షూటింగ్ ఆరంభమైందని చెబుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహా కుంభ మేళా కొనసాగనున్న నేపథ్యంలో బాలకృష్ణ సహా ప్రధాన పాత్రధారుల సన్నివేశాలు తెరకెక్కిస్తారని, దీనికోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం.
అద్భుతంగా వస్తోంది..
మహా కుంభ మేళాలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు బోయపాటి శ్రీను. ఇక్కడి ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అఘోరీలతో కూడిన సినిమా కావడం వల్ల ఈ నెల 11వ తేదీ నుంచే షూటింగ్ మొదలు పెట్టామని పేర్కొన్నారు. చిత్రీకరణ అద్భుతంగా సాగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications