చిక్కుల్లో ఏఆర్ రెహమాన్.. కాపీ రైట్స్ ఇష్యూలో 2 కోట్లు ఫైన్
చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈయన 1992లో 'రోజా' సినిమాతో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకుని సంచలనం సృష్టించారు రెహమాన్. ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించి, సంగీత రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. 19 ఫిలింఫేర్ అవార్డులు, నాలుగు జాతీయ పురస్కారాలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్టా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం, రెండు ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డు రెండుసార్లు గెలిచిన తొలి భారతీయుడుగా కూడా నిలిచారు.
కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏ.ఆర్ రెహమాన్ కాపీరైట్ వివాదంలో చిక్కుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ - 2' చిత్రంలోని "వీరా రాజా వీరా" అనే పాటలో కాపీరైట్ జరిగిందన్న ఆరోపణలపై కోర్టు షాకింగ్ తీర్పు వెల్లడించింది. రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లు పిటిషన్ దారుడికి చెల్లించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

"వీరా రాజా వీరా" పాట తన తండ్రి ఫయాజుదీన్ డగర్ మరియు మామ జాహిరుదీన్ డగర్ రాసిన 'శివ స్తుతి' నుంచి మేపుతూ రూపొందించారని, తమ అనుమతి లేకుండా సంగీతాన్ని వినియోగించారని ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు సాధించిన రెహమాన్‌కు కాపీరైట్ ఇష్యూలో ఫైన్ పడడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.
పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయానికి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కింది. కోలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సైతం కొల్లగట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష, రవి మోహన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ రెండు పార్టులకు కూడా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications