US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా (US) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ భారతీయులకు వీసా, గ్రీన్ కార్డుల విషయంలో ఏదో విధంగా సమస్యలు తప్పడం లేదు. ఇదే కోవలో భారత్ నుంచి అమెరికా వచ్చి స్ధిరపడాలనుకునే నిపుణులకు గ్రీన్ కార్డుల జారీ విషయంలో విదేశాంగశాఖ ఇవాళ మరో షాక్ ఇచ్చింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉపాధి ఆధారిత తొలి ప్రాధాన్య గ్రీన్ కార్డ్ (EB-1) కేటగిరీ రాబోయే వారాల్లో భారతీయులకు తాత్కాలికంగా అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రస్తుత అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో, భారత దరఖాస్తుదారుల కోసం కేటాయించిన కోటా అంతకంటే ముందే ముగిసిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఆగస్టు 2026 వీసా బులెటిన్ ప్రకారం, భారత్‌కు కేటాయించిన ఈబీ-1 గ్రీన్ కార్డ్ పరిమితి త్వరలోనే ముగిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కోటా పరిమితి పూర్తయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో తదుపరి వీసాల జారీ ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపేస్తారు. దీన్ని వీసా ఆంక్షల భాషలో చెప్పాలంటే అన్‌అవైలబుల్ గా పేర్కొంటారు. అయితే ప్రస్తుతానికి ఈ కేటగిరీ నిలిచిపోలేదని, దరఖాస్తుదారులను అప్రమత్తం చేయడానికే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు.

తాజా బులెటిన్ ప్రకారం, భారతీయులకు ఈబీ-1 గ్రీన్ కార్డ్ తుది యాక్షన్ డేట్ 2022 అక్టోబర్ 15గా ఉంది. అంటే ఈ నిర్దిష్ట తేదీ కంటే ముందు ప్రాధాన్యత కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే ప్రస్తుతం వీసాలు మంజూరు చేస్తారు. మరోవైపు, వీసా దరఖాస్తుల దాఖలుకు 2023 డిసెంబర్ 1ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. భారతీయ దరఖాస్తుదారులకు ఇప్పటికే ఈబీ-2 గ్రీన్ కార్డ్ కేటగిరీ ఆగస్టు నెలకు నిలిచిపోయింది. ఇప్పుడు ఈబీ-1 కేటగిరీపై కూడా ప్రభావం పడుతోంది. సాధారణంగా ఈబీ-1 కేటగిరీ కింద అసాధారణ శాస్త్రీయ, విద్యా, వ్యాపార ప్రతిభావంతులు అలాగే బహుళజాతి సంస్థల మేనేజర్లు గ్రీన్ కార్డ్స్ తీసుకోవచ్చు. వీరి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం వల్లే ఈ తాత్కాలిక కొరత ఏర్పడే పరిస్థితులు వచ్చాయి.














Click it and Unblock the Notifications