ఈ జింక అచ్చం కుందేలులా ఉందే! ప్రపంచంలోనే అరుదైన బుజ్జి జీవి
జింకలంటే మనకు పెద్ద కొమ్ములు, పొడవాటి కాళ్లతో ఎంతో చురుగ్గా కనిపించే జంతువులు గుర్తుకొస్తాయి. కానీ, జింక జాతిలోనే అత్యంత విచిత్రమైన, మినీ సైజులో ఉండే అద్భుతమైన జీవి ఒకటి ఉంది. అదే 'పుడు' (Pudu). చూడటానికి అచ్చం కుందేలులా అనిపించే ఈ జీవి నిజానికి జింక కుటుంబానికి చెందినదే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత చిన్న జింక జాతిగా ఇది గుర్తింపు పొందింది. కేవలం నాలుగు యాపిల్స్ పెట్టినంత ఎత్తు మాత్రమే ఉండే ఈ బుజ్జి జింకలు దక్షిణ అమెరికా దట్టమైన అడవుల్లో జీవిస్తున్నాయి.
జింకల కుటుంబానికి చెందిన ఈ పుడు జింకల్లో ప్రధానంగా రెండు జాతులు ఉన్నాయి. అవే నార్తర్న్ పుడు ,సదరన్ పుడు. వీటిలో ఉత్తరపు పుడు (Northern Pudu) మరింత చిన్నదిగా ఉంటుంది. ఇది కొలంబియా, ఈక్వెడార్, పెరూ దేశాలలోని అండీస్ పర్వత ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి సుమారు రెండు నుంచి నాలుగు వేల మీటర్ల ఎత్తున ఉండే దట్టమైన పర్వత అడవుల్లో సంచరిస్తుంది. దీని భుజం ఎత్తు కేవలం 32 నుంచి 35 సెంటీమీటర్లు మాత్రమే ఉండగా, బరువు 3.3 కిలోల నుంచి 6 కిలోల మధ్య ఉంటుంది. ఇక దక్షిణపు పుడు (Southern Pudu) దీనికంటే కాస్త పెద్దదిగా ఉండి, చిలీ, అర్జెంటీనా దేశాల అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది.

దట్టమైన అడవుల్లో సులువుగా తిరిగే చిన్న శరీరం
ఈ జింకల చిన్న శరీరం.. అడవులలోని దట్టమైన పొదలు, వెదురు చెట్ల మధ్య సులభంగా తిరిగేందుకు సరిగ్గా సరిపోతుంది. పెద్ద జింకలు వెళ్లలేని ఇరుకు దారుల్లో ఇవి ఇట్టే దూసుకెళ్లగలవు. ప్రధానంగా పొద్దుపోయే వేళల్లో, తెల్లవారుజామున ఇవి ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో పడిపోయిన చెట్ల పైకి ఎక్కడం, లేదంటే చెట్ల మీద ఉన్న ఆకులు, పండ్లను అందుకోవడం కోసం తమ వెనుక కాళ్లపై నిలబడటం వంటి విన్సిధాలు చేస్తుంటాయి. ఒకవేళ ఏవైనా శత్రువులు ఎదురైతే జిగ్-జాగ్ పద్ధతిలో వేగంగా పరిగెత్తడం లేదా ఎవరికీ కనిపించకుండా పొదల్లో నిశ్శబ్దంగా నక్కిపోవడం వీటి ప్రత్యేకత.
చిన్నవైనా సరే.. అచ్చం జింకల లక్షణాలే!
పరిమాణంలో చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ ఇవి జింకలకు ఉండే అన్ని సహజ లక్షణాలను కలిగి ఉంటాయి. మగ పుడు జింకలకు చిన్నపాటి కొమ్ములు వస్తాయి. అయితే ఇవి కేవలం 6 నుంచి 9 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆడ పుడు జింకలకు మాత్రం కొమ్ములు ఉండవు. అలాగే జింక జాతి సహజ లక్షణమైన తెల్లని చుక్కలు వీటి పిల్లల వీపులపై ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ, అనగా సుమారు ఎనిమిది వారాలు దాటేసరికి ఆ చుక్కలు క్రమంగా మాయమైపోవడం విశేషం.
ఎవరికీ అంతు చిక్కని అత్యంత అరుదైన జీవి
దక్షిణ అమెరికా దట్టమైన అడవులలో నివసించే ఈ పుడు జింకలు మనుషుల కంట పడటం చాలా అరుదు. వాటి శరీరం చిన్నదిగా ఉండటం, దట్టమైన పొదల్లో వేగంగా దాక్కునే నైపుణ్యం ఉండటం వల్ల ఇవి ఎవరికీ సులభంగా కనిపించవు. అడవి పిల్లులు, నక్కలు, గుడ్లగూబలు, పులులు వంటి క్రూర జంతువులకు ఇవి ఆహారంగా మారుతుంటాయి. ప్రకృతి సిద్ధంగా లభించిన ఈ అద్భుతమైన బుజ్జి జింకలు ప్రస్తుతం వన్యప్రాణి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.














Click it and Unblock the Notifications
