గ్రీన్ ఎనర్జీకి బిగ్ బూస్ట్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం-ధార పథకం!
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల పవర్ కష్టాలు తొలగించటానికి భారీగా నిధులను ఖర్చు చేయనుంది. పునరుత్పాదక ఇంధనం అయిన సోలార్, పవన విద్యుత్ ను దేశవ్యాప్తంగా సులభంగా చేరవేయడానికి భారీ పథకానికి ఆమోదం తెలిపింది. పీఎం-ధార పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి దీనికి మొత్తం రూ.1.86 లక్షల కోట్లు కేటాయించారు.
సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధనం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు ఒక చోట ఉంటాయి. కానీ వాడుకునే ప్రాంతాలు మరో చోట ఉంటాయి. ఆ విద్యుత్‌ను సులభంగా, నష్టం లేకుండా తరలించడానికి బలమైన ట్రాన్స్‌మిషన్ లైన్లు అవసరం అని భావించిన కేంద్రం పీఎం ధార పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిపోని కారణంగానే ఈ పథకం తీసుకొచ్చారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలను బలోపేతం చేస్తారు. దీని వల్ల 135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఒక చోట నుంచి మరో చోటకు సులభంగా తరలించవచ్చు. అంతేకాకుండా 50 గిగావాట్ పవర్ సామర్థ్యం ఉన్న బ్యాటరీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇవి విద్యుత్‌ను నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడతాయి.
మొత్తం ఖర్చులో ఎక్కువ భాగం రూ.1.36 లక్షల కోట్లు విద్యుత్ లైన్లు వేయడానికి, మిగతా రూ.50 వేల కోట్లు బ్యాటరీల కోసం ఖర్చు చేస్తారు. కేంద్రం దీనికి రూ.54 వేల కోట్లు సాయం ఇస్తుంది. ఈ పనులన్నీ 2032-33 నాటికి పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రభుత్వం 2030 నాటికి 500 గిగావాట్లు, 2035 నాటికి 900 గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం గ్రీన్ ఎనర్జీ దేశ వాప్తంగా చేరవేసే లక్ష్యానికి దోహదం చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కొత్త ప్రాజెక్టులను బిడ్డింగ్ ద్వారా ఇస్తారు. వీటిని కంపెనీలు నిర్మించి, నడిపి, నిర్వహిస్తాయి. మొత్తంగా చూస్తే, ఈ పథకం వల్ల దేశంలో గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. కాలుష్యం తగ్గుతుంది. ఇది గ్రీన్ ఎనర్జీకి బిగ్ బూస్ట్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications
