మరో షాకింగ్: SIR పూర్తి కాగానే వీఆర్ఎస్ దరఖాస్తు- సీఈఓ సంచలనం..!
దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR) తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, విపక్షాల ఓట్లను భారీ ఎత్తున తొలగిస్తోందన్న ఆరోపణలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ రాష్ట్రంలోనూ ఇప్పుడు ఎన్నికల అధికారుల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ఒడిశా ఎన్నికల ప్రధానాధికారి (Odisha CEO) ఆర్ఎస్ గోపాలన్ వీఆర్ఎస్ (ముందస్తు రిటైర్మెంట్ )కు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్ఎస్ గోపాలన్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రభుత్వ సర్వీసు నుండి స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన రిటైర్మెంట్ కు ఇంకా 21 నెలల సమయం ఉంది. తాజాగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 21న తుది జాబితా కూడా ఆయన విడుదల చేశారు. అనంతరం ఇలా ముందస్తు రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోపాలన్.. జూలై 2024 నుండి ఒడిశా సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. జూన్ 2028లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ లోపే ముందస్తు రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకోవడంపై చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి నెలకొన్న వివాదంతో తన వీఆర్ఎస్ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని గోపాలన్ స్పష్టం చేశారు.వ్యక్తిగత కారణాల వల్ల తాను వీఆర్ఎస్ తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. తాను వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించాలనుకుంటున్నానని, తన కుటుంబాన్ని చూసుకుంటూ, తన కుమారుడి పాఠశాల విద్య పూర్తయ్యే వరకు భువనేశ్వర్‌లోనే ఉంటానని కూడా గోపాలన్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా ప్రతిపక్షాలు తన రాజీనామాను డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నిస్తే.. "వారు సంతోషపడాలనుకుంటే సంతోషించనివ్వండి. సెప్టెంబర్ 2 నాటికి ప్రభుత్వ సర్వీసులో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాను, అందుకే వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒడిశాలో SIR తర్వాత ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో 3.16 కోట్ల మంది ఓటర్లు మిగిలారు. ఓటర్ల జాబితా నుంచి 27.50 లక్షల మందికి పైగా పేర్లను తొలగించడంపై ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఈవో వీఆర్ఎస్ దరఖాస్తు ప్రాధాన్యం సంతరించుకుంది.














Click it and Unblock the Notifications
