E20 Petrol: సీ-ఓటర్ సర్వేలో షాక్- వద్దే వద్దంటున్న ఎన్డీఏ ఓటర్లు..!
దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 Petrol)ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఓవైపు విశ్వప్రయత్నాలు చేస్తుంటే వాటి వినియోగదారుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తే తమ వాహనాలు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా పడిపోతుందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం దీనిపై వెనక్కి తగ్గడం లేదు. పైపెచ్చు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల నష్టపోయిన ఒక్క వాహనదారుడిని చూపించమని సవాళ్లు విసురుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల సర్వేల సంస్థ సీ-ఓటర్ తాజాగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై మీ అభిప్రాయాలు చెప్పమని ఓటర్లను అడిగింది. ఈ మేరకు సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇథనాల్ పై దూకుడుగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రానికి భారీ షాకిచ్చాయి. సీ-ఓటర్ సర్వే ప్రకారం ఎన్‌డిఎ మద్దతుదారులలో సగానికి పైగా ప్రజలు ఈ20 పెట్రోల్‌ను ఉపయోగించడానికి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల వాహనాలు దెబ్బతింటాయని, మైలేజీ తగ్గుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానానికి మద్దతు ఉన్నప్పటికీ, అధికార కూటమికి చెందిన ఓటర్లలో కూడా వాహనాల పనితీరుకు సంబంధించిన ఆందోళనలే అధికంగా ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తమ వాహనాల్లో ఈ20 పెట్రోల్‌ను వాడేందుకు ఇష్టపడబోమని 52.5 శాతం మంది ఎన్టీఏ ఓటర్లు చెప్పగా, కేవలం 18.1 శాతం మంది మాత్రమే దీనికి సానుకూలంగా స్పందించారు. మరో 29.5 శాతం మంది దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విపక్ష మద్దతుదారులలో ఈ వ్యతిరేకత మరింత బలంగా ఉంది. వీరిలో 57.9 శాతం మంది ఈ20 పెట్రోల్ వాడేందుకు నిరాకరిస్తున్నారు. ఈ సర్వే ప్రకారం, 52.8 శాతం మంది ప్రతిస్పందించిన వారు ఈ20 పెట్రోల్ తమ వాహన మైలేజీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎన్డీయే ఓటర్లలో 51.2 శాతం మంది ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఓటర్లలో ఈ సంఖ్య 55.4 శాతంగా కనిపించింది.












Click it and Unblock the Notifications