మీ ఇథనాల్ పెట్రోల్ కు ఓ దండం"- E20పై భారత్ కు భూటాన్ షాక్..!
ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలో చమురు దిగుమతుల్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు వాహనాలకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఎదురవుతున్న సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయినా కేంద్రం మాత్రం తన మొండిపట్టు వీడటం లేదు. ఎలాగైనా ఇథనాల్ పెట్రోల్ వాడకం పెంచాలని కార్ల కంపెనీల్ని కూడా ప్రోత్సహిస్తోంది. ఇదే క్రమంలో పొరుగుదేశం భూటాన్ (Bhutan)కు కూడా తమ ఇథనాల్ పెట్రోల్ ఈ20ని తీసుకోవాలని ఆఫర్ ఇచ్చింది. అయితే భూటాన్ దీన్ని తిరస్కరించింది.
E20 ఇంధన సరఫరాపై భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసిన ప్రతిపాదనను భూటాన్ నిశ్శబ్దంగా తిరస్కరించింది. భారత మార్కెట్లో సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత కాలం, దానినే సరఫరా కొనసాగించాలని భూటాన్ భారత్‌ను కోరింది. అయితే ఇథనాల్ పెట్రోల్ ను భూటాన్ ఎందుకు వద్దని చెప్పిందనే దానిపై కీలక కారణాలు కనిపిస్తున్నాయి. భూటాన్‌లో ఇంధన నిల్వ సదుపాయాలు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను నిర్వహించడానికి అనువుగా లేవు. వాహనాలకు గరిష్ట శక్తి అవసరం కాబట్టి, అక్కడి నిటారుగా, కొండలతో కూడిన భూభాగం కూడా సవాలుగా ఉంది. భూటాన్‌లోని పర్వత ప్రాంత రహదారులపై అవసరమైన స్థిరమైన పనితీరును ఈ20 అందించకపోవచ్చని అధికారులు భయపడుతున్నారు.

భారతదేశంల 20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమమైన E20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టడం 2023కి ముందు తయారైన పెట్రోల్ వాహనాల యజమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్ తగ్గిపోవడం, నిర్వహణ సమస్యలు పెరగడం, వాహనాలు అధికంగా అరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ20 వల్ల మైలేజ్ కొద్దిగా తగ్గుతుందని ప్రభుత్వం తాజాగా అంగీకరించినప్పటికీ, మెరుగైన యాక్సిలరేషన్, మంచి ఇంజిన్ పనితీరుతో పోలిస్తే ఈ ప్రతికూలతను అధిగమించవచ్చని చెబుతోంది. ఈ నేపథ్యంలో E20 పెట్రోల్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు భూటాన్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే, తన ఇంధనాన్ని మొత్తం నేరుగా భారత్ నుండే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత భూటాన్ భారత్ నుండి అధిక-ఎక్స్ పోర్ట్ క్వాలిటీ గల పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తోంది. ఇవి భారతీయ పెట్రోల్ బంకుల్లో అమ్మే ఇంధనం కంటే ఖరీదైనవి. అయితే E20 పెట్రోల్‌ను సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్ని భూటాన్ తిరస్కరించింది.














Click it and Unblock the Notifications