Venkatesh: 40 ఏళ్ల సినీ ప్రస్తానం.. హీరో కాకపోతే ఏం చేసేవారో చెప్పిన వెంకీమామ..
Venkatesh: టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలు, కామెడీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాలు, భావోద్వేగ కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన వెంకీమామ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనదైన నటన, తన మేనరిజంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణం తర్వాత వెంకటేష్ తాజాగా ఓ ఆసక్తికర సీక్రెట్‌ను బయటపెట్టారు. అసలు హీరోగా సినిమాల్లోకి రాకపోయి ఉంటే తన జీవితాన్ని ఏ దారిలో తీసుకెళ్లేవారో స్వయంగా వెల్లడించారు. ఇంతకీ వెంకీమామ చెప్పిన ఆ ఆసక్తికర విషయం ఏంటి?
ప్రస్తుతం వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నెం. 47) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెంకటేష్ తన కెరీర్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించడం ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

'మీరు మొదట్లో మీ ఫ్యామిలీ బిజినెస్‌లో ఉన్నారు. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే మిమ్మల్ని మేము ఎలా చూసేవాళ్లం?' అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. హీరో వెంకటేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఎక్కడో ప్రొడక్షన్ మేనేజర్‌గా కనిపించేవాడినని, లేదంటే నిర్మాతగా సినిమాలు నిర్మించేవాడినని తెలిపారు. తన అన్నయ్య సురేష్ బాబు మాదిరిగానే సినిమాల నిర్మాణంలో భాగమయ్యేవాడినని చెప్పారు.
అంతేకాదు.. నిజానికి కెమెరా ముందుకు రావాలని తనకు ఎప్పుడూ పెద్దగా ఆసక్తి లేదని వెంకటేష్ స్పష్టం చేశారు. అయితే జీవితంలో కొన్ని విషయాలు మనం అనుకున్నట్టుగా జరగవని, ఏదో ఒక దశలో మన జీవితానికి మరో దారి ఏర్పడుతుందని, తన విషయంలోనూ అదే జరిగిందని చెప్పారు. హీరోగా మారడం తన ప్లాన్ కాదని.. పరిస్థితులు, కుటుంబం, సినిమా అవకాశం అన్నీ కలసి తనను నటుడిగా మార్చాయని అన్నారు.
ఈ సందర్భంగా వెంకటేష్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు నుంచి నేర్చుకున్న ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు. ఏ రంగంలో ఉన్నా కష్టపడి పని చేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని రామానాయుడు తనకు నేర్పించారని చెప్పారు. మన చేతుల్లో ఉన్నది పని చేయడం, నిజాయితీగా ప్రయత్నించడం మాత్రమేనని.. ఫలితం ఎప్పుడు, ఎలా రావాలనేది మన చేతుల్లో ఉండదని వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
జీవితాన్ని ముందుగానే ఎక్కువగా ఊహించుకోవడం, అవసరానికి మించి అంచనాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని కూడా అన్నారు. మనం చేయాల్సిన పని మనం పూర్తిగా చేయాలి.. ఫలితంపై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. తాను ఇప్పుడు ఈ ఆలోచనను బలంగా నమ్ముతున్నానని, మన ప్రయత్నం చేసిన తర్వాత మిగతాదంతా దేవుడిపై వదిలేయాలని భావిస్తానని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

















Click it and Unblock the Notifications
