"చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్లారు?"- వైసీపీ పోల్- లోకేష్ ఘాటు కౌంటర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు (Chandrababu) తాజాగా విదేశీ టూర్ కు వెళ్లారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారన్న సమాచారం మాత్రం అధికారికంగా బయటపెట్టలేదు. ఇందుకు గల కారణాలు కూడా ఎవరికీ తెలియదు. దీంతో చంద్రబాబు రహస్య పర్యటనలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ విమర్శలు ప్రారంభించింది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఓ పోల్ కూడా పెట్టింది. దీనిపై స్పందించిన ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ విపక్షానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు అధికారిక సమాచారం లేకుండా విదేశీ టూర్ కు వెళ్లడంపై వైఎస్సార్సీపీ వరుసగా విమర్శలు గుప్పిస్తోంది. ఇదే క్రమంలో ఎక్స్ లో ఓ పోల్ కూడా పెట్టింది. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్లారని ఇందులో వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. ఇందులో అమెరికా, బ్రిటన్, సింగపూర్ అంటూ మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఈ ట్వీట్ కు స్పందనగా పలువురు వివిధ దేశాల పేర్లను ఎంచుకున్నారు. ఈ పోల్ పై టీడీపీ మండిపడుతోంది. చంద్రబాబు టూర్ పై వైఎస్సార్సీపీ వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆ పార్టీ నేతలు కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు.

Two grandparents and their grandson took a weekend off for a short family holiday. One hopeless political party has been obsessing about it since then. Get a life guys! https://t.co/4MVlO2scq3
— Lokesh Nara (@naralokesh) September 29, 2026
ఇదే క్రమంలో మంత్రి, చంద్రబాబు కుమారుడు కూడా అయిన నారా లోకేష్ ఎక్స్ లోనే వైఎస్సార్సీపీ పెట్టిన పోల్ కు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నానమ్మ, తాతయ్యలు తమ మనవడిని తీసుకుని కుటుంబ వీకెండ్ టూర్ కు వెళ్లారని నారా లోకేష్ ఇందులో తెలిపారు. కానీ ఓ నిస్పృహలో ఉన్న రాజకీయ పార్టీ మాత్రం దీనిపై అప్పటి నుంచీ ఆందోళన చెందుతోందని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ ను టీడీపీతో పాటు కూటమి నేతలు వైరల్ చేసే పనిలో ఉన్నారు. వీరి విమర్శలు, ప్రతివిమర్శల సంగతి ఎలా ఉన్నా.. వాస్తవానికి ప్రభుత్వాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు సమాచారం ఇస్తుంటారు. అలాగే మీడియాకూ కనీసం లీకులు ఇస్తారు. ఈసారి చంద్రబాబు టూర్ కు సంబంధించి వివరాలేవీ వెల్లడించకపోవడంతో చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన కుమారుడు లోకేష్ స్వయంగా స్పందించి దీనికి చెక్ పెట్టారు.












Click it and Unblock the Notifications
