Palle Panduga 3.0: "శభాష్ పవన్ కళ్యాణ్.."! - పల్లె పండుగలో చంద్రబాబు..!
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఇవాళ పల్లె పండుగ 3.0ను (Palle Panduga 3.0) సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో భాగంగా పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాలు పూర్తి చేసుకుని 3.0లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలుకుతున్నామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మూడు పల్లె పండుగలు నిర్వహించుకున్నామని, అన్నీ సక్సెస్ అయ్యాయని చంద్రబాబు తెలిపారు.
ఉద్యమ స్పూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంతలు ఉండేవని, వీధి దీపాలు లేవని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టాలన్నా దిక్కు లేని పరిస్థితి ఉండేదన్నారు. నాటి దుస్థితి నుంచి పవన్ కళ్యాణ్ పల్లెలను అభివృద్ధి బాట పట్టించారని చంద్రబాబు కితాబిచ్చారు. కూటమి ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ వేశారన్నారు. గ్రామ వికాసంలో భాగంగా పవన్ అనేక మార్పులు తెచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో 13326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టారని, అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు.

రెండున్నర దశాబ్దాల తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థలోని వివిధ హోదాల్లో ఉన్న 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4136 కోట్లు విడుదల చేశారని, లక్షకు పైగా పంటకుంటలు తవ్వించారని, పశువుల కోసం నీటి తొట్టేలు కట్టించారని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో పంచాయతీ రాజ్ శాఖ 13 జాతీయ అవార్డులు దక్కించుకుందన్నారు. పవన్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ పేదల కోసం పని చేస్తోందన్నారు. పొట్టి శ్రీరాములు జల ధార కింద జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభించబోతున్నామని, ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రోడ్ల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ రెండేళ్లల్లో అభివృద్ధి చేస్తోందని, జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు మహిళలు, ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.














Click it and Unblock the Notifications
