నారా లోకేష్ పై అభ్యర్ధిని ఫిక్స్ చేసిన జగన్, అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల వేళ పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కూటమి- వైసీపీ స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ పదవుల్లోనూ మార్పులు మొదలు పెట్టారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో పలువురి పదవుల్లో మార్పులు చేసారు. నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి కొత్త సమన్వయ కర్తను ప్రకటించారు. బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డికి మంగళగిరి బాధ్యతలు కేటాయించారు. ఇప్పటి వరకు దొంతిరెడ్డి వేమారెడ్డి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మురుగుడు లావణ్య పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వేణుగోపాల సోమిరెడ్డికి బాధ్యతలు అప్పగించటం పైన వేమారెడ్డి వర్గం ఆగ్రహంగా ఉంది. పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తున్న తమను తప్పించటం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, మంగళగిరి నియోజకవర్గం 2024 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన రెండో నియోజకవర్గంగా నిలబెట్టుకుంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో లోకేష్ ను ఓడించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రామక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తిరిగి కొద్ది రోజులకే బయటకు వచ్చేసారు. అయినా.. రాజకీయాలకు దూరం అయ్యారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ఇప్పుడు వేణుగోపాల సోమిరెడ్డిని నియోజకవర్గ సమన్యయకర్తగా నియమించారు. కీలకమైన.. టీడీపీకి బలమైన నియోజకవర్గంలో జగన్ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయనేది కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
