పాకిస్థాన్ లోని ఆ రాష్ట్రంలో గవర్నర్ రూల్..? కారణం ఇదే..!
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పరిస్థితి చేజారిపోతుంది. ఆ రాష్ట్రంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ క్రమంలో అక్కడ గవర్నర్ రూల్ ను విధించేందుకు రాజ్యాంగ పరమైన అవకాశాలను పాకిస్థాన్ ప్రభుత్వం అన్వేషిస్తోంది. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుస ఉగ్రదాడులు.. వరుసగా ఆత్మాహుతి దాడులు పాకిస్థాన్ ప్రభుత్వానికి, పోలీసులు, అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిపై ఆంక్షల కారణంగా పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు సొంత రాష్ట్రంలోనూ పాకిస్థాన్ కు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఈ మేరకు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ విషయంలో రాజ్యాంగ పరంగా కీలక నిర్ణయం తీసుకోవాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక ఇదే అంశంపై తాజాగా పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మోహసీన్ నక్వీ.. పాకిస్థాన్ రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీతో కరాచీలోని బిలావల్ హౌజ్ లో ప్రత్యేకమైన భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో రోజురోజుకూ క్షీణిస్తున్న పరిస్థితులు, భద్రతా పరమైన వైఫల్యాలతోపాటు పరిపాలనా పునర్వ్యవస్థీకరణ, బోర్డరింగ్ ప్రాంతాల్లో భద్రతా పెంపు, అలాగే రాజ్యాంగ పరమైన చర్చలపైనా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక పాకిస్థాన్ లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఒకటి. ఈ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు, ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం అక్కడి ప్రభుత్వానికి సవాల్ గా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రంలో గవర్నర్ పాలనను విధించాలని పాక్ సర్కార్ యోచిస్తోంది.

ఈ మేరకు పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 232, ఆర్టికల్ 234 రూల్స్ ను ఫెడరల్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టికల్ 232 దేశం మొత్తం విధించే రాష్ట్రపతి పాలన కాగా ఆర్టికల్ 234 మాత్రం దేశంలోని ఏదైనా ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు విధిస్తుంటారు. అయితే ప్రస్తుతానికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో గవర్నర్ రూల్ విధించాలన్నది కేవలం ఆలోచనగానే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
