మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత..! ప్రముఖుల సంతాపాలు..!
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasiva Rao) ఇవాళ కన్నుమూశారు. 82 ఏళ్ల రాయపాటి అనారోగ్యంతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ రాయపాటి ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో గుంటూరు, నరసరావుపేట లోక్ సభ స్ధానాల నుంచి ఎంపీగా పనిచేసిన రాయపాటి మరణంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విషాద ఛాయలు నెలకున్నాయి. పలువురు ఆయన మరణంపై సంతాపాలు తెలుపుతున్నారు.
1972లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 1982లో ఆయన్ను రాజ్యసభ సీటు వరించింది. అక్కడి నుంచి 1988 వరకూ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రాయపాటి.. అనంతరం 1996, 1998, 2004, 2009లో గుంటూరు నుంచి లోక్ సభ ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన పార్టీని వీడారు. అనంతరం 2014లో టీడీపీలో చేరిన రాయపాటికి నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో నరసరావుపేట ఎంపీగా గెలిచిన ఆయన.. 2019 వరకూ పనిచేశారు.













Click it and Unblock the Notifications
